తెలంగాణ ముఖ్యాంశాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. టీఆర్ఎస్ కు ఓటు వేసిన వారికే దళితబంధు ఇస్తామని ఈయన అనడంఫై ప్రతిపక్ష పార్టీలతో పాటు పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు. తమ గ్రామస్తులకు దళితబంధు అందడం లేదని… అర్హులైన వారికి దళితబంధు ఇవ్వాలని రాంసాగర్ సర్పంచ్ రవీందర్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు.

దీనికి సమాధానంగా మ్మెల్యే మాట్లాడుతూ.. రాంసాగర్​ నుంచి దళితబంధుకు ఒకటో రెండో ఉంటే పెడదాం. అర్హులెవరైనా ఉంటే.. తెలంగాణ సోయున్నోళ్లు.. అర్థమైంది కదా.. దాపరికం లేదు. ఎందుకుండాలి.. నీళ్లిస్తుండ్రు కదా.. అంతకుముందు నీళ్లు లేవు కదా.. కరెంటు లేకుండే కదా, ఎదిగిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు సర్కారు పైసలిస్తుంది కదా, గర్భిణులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రసూతి చేస్తున్నం కదా, ఉల్టా పైసలు కూడా ఇస్తున్నం కదా.. ఇవన్నీ నష్టమా, లాభమా తెలంగాణకు.. అట్లా కాబట్టి ఆ సోయున్నోళ్లుంటే పెట్టియ్యి, ఆ సోయి లేకుంటే పెట్టకు, కేసీఆర్‌కే ఓట్లు వేస్తం, తెలంగాణనే గెలిపిస్తమన్నోళ్లుంటే పెట్టు, ఓపెన్‌ సీక్రెట్‌ ఇది.. దాపరికం లేదు.’

ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డిపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మండిపడింది. దళిత సర్పంచ్ ను అవమానించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కేసీఆర్ కు ఓటు వేస్తేనే దళితబంధు ఇస్తాం… నువ్వు నోరు మూసుకుని కూర్చో’ అంటూ అవమానించిన ముత్తిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/