తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరులకు మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ , జగన్ మోహన్ రెడ్డిలు. త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక! అని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు, హిందువులూ కలిసి నిర్వహించే ‘పీర్ల’ ఊరేగింపు తెలంగాణ ప్రజలమధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్ ను చూపే సందర్భం! అంటూ సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా పేర్కొన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహర్రం అని చెప్పారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయని ముఖ్యమంత్రి తన సందేశంలో తెలిపారు.
మొహర్రం పండగ సందర్భంగా అందరూ త్యాగస్ఫూర్తిని అందుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. దుర్మార్గాలు, దౌర్జన్యాలపై పోరాడుతూ ప్రాణాలతో సహా సర్వస్వాన్నీ అర్పించిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని మొహర్రం సందర్భంగా గుర్తు చేసుకోవాలని చెప్పారు. ధర్మ పరిరక్షణ కోసం సమాజానికి అండగా నిలిచేందుకు హుస్సేన్ త్యాగస్ఫూర్తిని అందుకుందాం అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇక మొహర్రం సందర్భాంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. బీబీ-కా-ఆలం ఊరేగింపును దృష్టిలో ఉంచుకుని, దబీర్‌పురా, చాదర్‌ఘాట్ మరియు యాకుత్‌పురా ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు. ఈ ఊరేగింపు బీబీ కా అలవా, దబీర్‌పురా నుండి చాదర్‌ఘాట్‌లోని మస్జిద్-ఇ-ఇలాహి వైపు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.
వాహనాలు సునర్‌గల్లి టి జంక్షన్ వద్ద బీబీ కా అలవా వైపు అనుమతించబడవు. యాకుత్‌పురా వైపు దబీర్‌పురా దర్వాజా మరియు గంగా నగర్ నాలా వైపు మళ్లించబడతాయి. అదేవిధంగా షేక్ ఫైజ్ కమాన్ వైపు వాహనాలను అనుమతించరు. వాటిని జబ్బార్ హోటల్ వద్ద దబీర్‌పురా దర్వాజా లేదా చంచల్‌గూడ వైపు మళ్లిస్తారు.ఎతేబార్ చౌక్ నుండి వెళ్లే వాహనాలు బడా బజార్ వైపు అనుమతించబడవు, కానీ ఎతేబార్ చౌక్ వద్ద కోట్లా అలీజా లేదా పురానా హవేలీ వైపు మళ్లించబడతాయి.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/