కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమని వ్యాఖ్య
సిఎం జగన్ కుప్పం మునిసిపాలిటీ లోని 25 వార్డుల్లో పనులకు రూ. 66 కోట్లను మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత వారం కుప్పం నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలతో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిదే. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానమని అన్నారు. కుప్పంపై ప్రత్యేక దృష్టిని సారిస్తానని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు భారీగా నిధులను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో కుప్పంపై ముఖ్యమంత్రి మరెన్ని వరాలు కురిపిస్తారో వేచి చూడాలి.
కాగా, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సిపి గెలుపొందే దిశగా పార్టీ నేతలు, కార్యకర్తలు పని చేయాలని… అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం కష్టమేమీ కాదంటూ ఏపీ సీఎం జగన్ తన పార్టీ శ్రేణులకు చెపుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా పని చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో కూడా గెలుస్తామని ఆయన తన పార్టీ శ్రేణుల్లో మనోస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చాలం కాలం నుంచే కుప్పంపై ప్రత్యేక దృష్టిని సారించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/