జాతీయం ముఖ్యాంశాలు

ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత

ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (62) కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. ఆరోగ్య సమస్యలతో కొద్దిరోజుల క్రితం ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం రెండు వారాల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో ఉదయం 6.45 గంటలకు ముంబైలోని క్యాండీ బ్రీచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు నిర్ధారించారు.

ట్రేడర్‌గా చార్టెడ్‌ అకౌంటెంట్‌గా ఆయన ఎంతో పేరుగడించారు. భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో రాకేశ్ ఒకరిగా నిలిచారు. హైదరాబాద్‌ రాజస్థానీ కుటుంబంలో జన్మించిన ఝున్‌ఝున్‌వాలా.. ఈ మధ్యే విమానయాన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆయన సారథ్యంలోని ఆకాశ ఎయిర్‌ ఈ నెల 7న తన తొలి సర్వీసును ప్రారంభించింది.

ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా పేరుగాంచిన ఆయన.. 1985లో స్టాక్‌మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. రూ.5 వేలతో స్టాక్‌ ట్రేడింగ్‌లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అంచలంచలుగా ఎదిగిన ఆయన ప్రస్తుత సంపాదన రూ.35 వేల కోట్లు. ప్రస్తుతం ఆయన ఆప్‌టెక్‌ లిమిటెడ్‌, హంగామా డిజిటల్‌ మీడియా ఎంటర్‌టైనర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలకు చైర్మన్‌గా ఉన్నారు. పలు భారతీయ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు భార్య రేఖ, ముగ్గురు సంతానం ఉన్నారు. రేఖ కూడా స్టాక్‌ ఇన్వెస్టరే కావడం విశేషం.

ఝున్‌ఝున్‌వాలా మృతిపట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. పెట్టుబడుల రంగంలో చెరగని ముద్ర వేశారని అన్నారు. అనేకమంతి పెట్టుబడిదారులకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేశారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/