మరో చరిత్రాత్మక ఘట్టానికి నాసా శ్రీకారం చుట్టింది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపైకి పంపే బృహత్తర కార్యక్రమానికి తొలి అడుగు పడింది. గతంలోలా కాకుండా జాబిలిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది.ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్తాయి.
చందమామను చుట్టి వచ్చే ఈ స్పేస్ షిప్ లో వ్యోమగాములు ఉండరు. తర్వాత జరిగే ప్రయోగాలు మాత్రం మానవ సహితంగానే సాగుతాయని నాసా తెలిపింది. ఆర్టెమిస్ అంటే గ్రీక్ పురాణాల ప్రకారం ఒక దేవత. జ్యూస్ కుమార్తె. అపోలోకు కవల సోదరి. ఆర్టెమిస్ యాత్రల్లో భాగంగా మహిళా వ్యోమగామికీ అవకాశం కల్పిస్తున్నందువల్ల ఈ దేవత పేరును నాసా ఎంచుకుంది. ఈ ప్రాజెక్టు కోసం నాసా 9,300 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తోంది.
1960లో చందమామపైకి మానవ సహిత యాత్రలు నిర్వహించడానికి అమెరికా అపోలో ప్రాజెక్టును చేపట్టింది. అయితే నాడు సైన్స్ పరిశోధనల కోసం కాకుండా సోవియట్ యూనియన్‌పై పైచేయి సాధించడమే లక్ష్యంగా అగ్రరాజ్యం వీటిని నిర్వహించింది. జాబిలిపైకి 1969లో మొదలైన మానవసహిత యాత్రలు 1972లో ముగిశాయి. ఏ యాత్రలోనూ వ్యోమగాములు మూడు రోజులకు మించి చందమామపై ఉండలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. భూకక్ష్యకు వెలుపల లోతైన పరిశోధనలు చేయాలన్న ఆసక్తి పెరిగింది. చందమామ, అంగారకుడు, ఆ వెలుపలి ఖగోళ వస్తువులపై కాలనీల ఏర్పాటుకు పరిశోధకులు సిద్ధపడుతున్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/