తెలంగాణ ఎన్ని ప్రతిపాదనలు పంపినా మీరు ఇచ్చింది సున్నా అన్న కెటిఆర్
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో చేసిన ట్వీట్ పై తెలంగాణ మంత్రి కెటిఆర్ సెటైర్లు వేశారు. దేశ వ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం ప్రధాని మోడీ సాధించిన గొప్ప విజయమని మాండవీయ ట్వీట్ చేశారు. ట్వీట్ కు 157 కాలేజీల జాబితాను జత చేశారు. మాండవీయ ట్వీట్ పై కెటిఆర్ స్పందిస్తూ సెటైర్లు వేశారు. తెలంగాణలో మీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదని… రాష్ట్రానికి మీరు ఇచ్చింది సున్నా అని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదని విమర్శించారు.
అంతేకాదు… మెడికల్ కాలేజీల కోసం 2015లో అప్పటి ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, 2019లో అప్పటి ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి రాసిన లేఖలను కూడా షేర్ చేశారు. కొత్త వైద్య కళాశాలల కోసం కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం అడుగుతూనే ఉందని… అయినప్పటికీ కేంద్రం నుంచి స్పందన రాలేదని చెప్పారు. మెడికల్ కాలేజీల అంశంపై స్పందించే ముందు పూర్తి వివరాలను తెలుసుకుని ఉంటే బాగుండేదని అన్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/