తెలంగాణ ముఖ్యాంశాలు

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో..పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. రెండు వేల మందితో భారీ బందోబస్త్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సభలు, సమావేశాలు నిరసన కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అసెంబ్లీ లోపల నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులతో పహారా కాస్తున్నారు.

ఈరోజు ఉదయం 11.30కు సమావేశాలు వేర్వేరుగా ప్రారంభమవుతాయి. శాసనసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలి కాలంలో దివంగతులైన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం (తుంగతుర్తి), పరిపాటి జనార్దన్‌రెడ్డి (కమలాపూర్‌)కి సంతాపం ప్రకటిస్తూ ప్రకటన చేస్తారు. అనంతరం సభను ఈ నెల 12కు వాయిదా వేస్తూ స్పీకర్‌ ప్రకటన చేసే అవకాశముంది. సభ వాయిదా అనంతరం స్పీకర్‌ చాంబర్‌లో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండా, సభ నిర్వహణ తేదీలను ఖరారు చేస్తారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 12 నుంచి రెండు లేదా మూడు రోజుల పాటు సభ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 16 నుంచి ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో 15వ తేదీలోపే అసెంబ్లీ సెషన్‌‌‌‌ ముగించాలనే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/