బుధువారం రాత్రి సికింద్రాబాద్ రూబీ హోటల్ సెల్లార్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ షాపులో ఛార్జింగ్ పెట్టిన బైక్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరణించిన వారందరూ దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడకనే చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ఐదుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల్లో ఏడుగురు పురుషులు, మహిళ ఉన్నారు. వీరి వయసు 35 నుంచి 40 ఏళ్లలోపు అని సమాచారం. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో విజయవాడకు చెందిన ఎ.హరీశ్, చెన్నై వాసి సీతారామన్, దిల్లీ వాసి వీతేంద్ర ఉన్నట్లు గుర్తించారు.
లాడ్జిలో 23 గదులున్నాయి. దాదాపు25 మంది పర్యాటకులున్నట్లు అంచనా. ప్రమాదంతో ఒక్కసారిగా హోటల్‌లోని పర్యాటకులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో హాహాకారాలు చేయసాగారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో ఏమైందోనని భయాందోళనకు గురయ్యారు. వాహనాల నుంచి వెలువడిన పొగ కారణంగా ఊపిరి ఆడక కొందరు స్పృహ తప్పి లాడ్జి గదులలో, కారిడార్‌లో పడిపోయారు. దట్టంగా పొగచూరడంతో శ్వాస తీసుకునే పరిస్థితి లేక ఎనిమిది మంది చనిపోయారు.
ఈ అగ్నిప్రమాదంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్, ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోడీ.. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ఆశించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు పీఎంఓ ట్విటర్ ద్వారా తెలిపింది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/