ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఇదంతా ఓ దొంగల బ్యాచ్ః అసెంబ్లీ లో సిఎం జగన్‌ ప్రసంగం

అప్పుల గురించి వివరించిన ముఖ్యమంత్రి

పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి సభలో సభ్యులకే కాకుండా, రాష్ట్రంలోని ప్రజలకు కూడా తెలియాలని అన్నారు. ఎవరి హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీలేదని, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏవైనా ఉంటే అది చంద్రబాబునాయుడికే ఉండాలేమో అధ్యక్షా అంటూ వ్యంగ్యంగా అన్నారు.

“రాష్ట్రం బాగుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది అంటే చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు ఏమాత్రం బాగుండదు. వారు ఆ విషయాన్ని జీర్ణించుకోలేరు. సంక్షేమ పథకాలకు నిధులు రాకుండా ఆగిపోతే, ఆపగలిగితే, తప్పుడు లేఖ రాసి నిధులను అడ్డుకోగలిగితే బాగుండును అనే శక్తులు ఏవో అందరికీ తెలుసు. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఏపీ అభివృద్ధి పరంగా ఎంతో ముందంజలో ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన 98.4 శాతం హామీలు అమలు చేశాం.

రాష్ట్రం అన్ని విధాలా బాగున్నా గానీ, రాష్ట్రం ఏమాత్రం బాగాలేదని, ఇబ్బందుల్లో ఉందని, మరో శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసే ఓ బ్యాచ్ ఉంది. ఇదంతా ఓ దొంగల బ్యాచ్. దోచుకో, పంచుకో, తినుకో అనే ఈ బ్యాచ్ లో చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో పాటే దత్తపుత్రుడు కూడా అంతోఇంతో వాళ్లకు తోడుగా ఉన్నాడు. వాళ్లకున్న పత్రికలు, చానళ్లతో ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/