అంతర్జాతీయం ముఖ్యాంశాలు

నేడు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు

లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో జరగనున్న అంత్యక్రియలు

నేడు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు జరగనున్నాయి. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 11 రోజుల సుదీర్ఘ సంతాప దినాల అనంతరం ఈరోజు అంత్యక్రియలు జరగనున్నాయి. 1965లో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్ టన్ చర్చిల్ మరణం తర్వాత ఇన్ని రోజుల పాటు సంతాప దినాలను కొనసాగించడం ఇదే తొలిసారి. రాణి అంత్యక్రియలకు వివిధ దేశాల అధినేతలు హాజరవుతున్నారు. మన దేశం తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు.

రాణి అంత్యక్రియలను బ్రిటన్ లోని 125 సినిమా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికి తోడు దేశ వ్యాప్తంగా ప్రజలు వీక్షించేందుకు పార్కులు, క్యాథెడ్రల్స్, స్క్వేర్స్ లో లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఎలిజబెత్ బామ్మ క్వీన్ విక్టోరియాను తీసుకొచ్చిన ఫిరంగి పైనే ఈమె పార్థివ దేహాన్ని కూడా తీసుకురానున్నారు. ఈ ఫిరంగిని 142 మంది సెయిలర్స్ లాగుతూ తీసుకొస్తారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని బిలియన్ల మంది అంత్యక్రియలను వీక్షించనున్నారు.

రాణి భౌతికకాయాన్ని తీసుకెళ్లే దారిలో ఇరువైపులా రాయల్ నేవీ, రాయల్ మెరైన్స్ సిబ్బంది గౌరవ సూచకంగా నిలబడి ఉంటారు. ఆమె తుది యాత్ర పార్లమెంట్ స్క్వేర్ మీదుగా వెళ్తుంది. అక్కడ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రాణి పార్థివదేహానికి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పిస్తారు. స్కాటిష్, ఐరిష్ రెజిమెంట్ల సమక్షంలో అంత్యక్రియలు జరుగుతాయి. గూర్ఖాలు, రాయల్ ఎయిర్ ఫోర్స్ రెజిమెంట్లకు చెందిన 200 మంది సంగీతకారులు మ్యూజిక్ ప్లే చేస్తారు. రాణి శవపేటికను కింగ్ చార్లెస్ తో పాటు రాయల్ ఫ్యామిలీ సభ్యులు అనుసరిస్తారు.

రాణి అంత్యక్రియలకు రష్యా, ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్, సిరియా, నార్త్ కొరియాలను ఆహ్వానించలేదు. ఎలిజబెత్ రాణి 96 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. 70 ఏళ్ల 214 రోజుల పాటు ఆమె సుదీర్ఘంగా రాణిగా పాలన కొనసాగించారు. మరోవైపు రాణి అంతిమయాత్ర కొనసాగే వీధులు జనాలతో పోటెత్తే అవకాశం ఉంది. వీరిని నిలువరించడం బ్రిటన్ పోలీసులకు కత్తిమీద సామే అని చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/