ఖమ్మం: ఇవ్వాళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఘనంగా నివాళి అర్పించారు. కడప జిల్లాలోని ఇడుపుల పాయలో గల వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించారు. తల్లి విజయమ్మ, కుమార్తె అంజలి రెడ్డి, కుమారుడు రాజారెడ్డితో కలిసి నివాళి అర్పించారు.
నిత్యం ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన పాలన తరతరాలకు ఆదర్శమని, చిరస్మరణీయంగా నిలిచిపోతుందని చెప్పారు. ఆయన పాలనలో అమలు చేసిన అద్భుతమైన పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కోట్లాది తెలుగు ప్రజలకు వైఎస్సార్ కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందని అన్నారు.”
అనంతరం ఆమె అక్కడి నుంచి నేరుగా ఖమ్మం జిల్లా పాలేరుకు చేరుకున్నారు. వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్న విషయం తెలిసిందే. విగ్రహావిష్కరణ అనంతరం ప్రసంగించారు. తన పాదయాత్రను పునరుద్ధరించబోతోన్నట్లు తెలిపారు. ఈ నెలలోనే మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తానని, పాలేరులో 4,000 కిలోమీటర్లతో దీన్ని పూర్తి చేస్తానని అన్నారు.
పాలేరు ప్రజలకు వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని, ఈ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని షర్మిల అన్నారు. రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తానని చెప్పారు. పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లిస్తానని వివరించారు. ఆరోగ్య శ్రీని మరింత పకడ్బందీగా అమలు చేస్తానని, వైఎస్సార్ సంక్షేమ పాలనను తీసుకొస్తానని షర్మిల పునరుద్ఘాటించారు.
వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాటిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు. ఈ గడ్డ మీది నుంచే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతోన్నానని మరోసారి తేల్చి చెప్పారు. ఈ నెలలోనే నియోజకవర్గంలో విస్తృతంగా కాలినడకన కలియ తిరుగుతానని, 4,000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేస్తానని పేర్కొన్నానరు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/