tomato
జాతీయం ముఖ్యాంశాలు

రూ.20కే కిలో టమాటా.. క్షణాల్లో ఖాళీ

తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తన షాపు వార్షికోత్సవం సందర్భంగా రూ.20కే కిలో టమాటా విక్రయించాడు. 550 కేజీల టమాటాలు క్షణాల్లో అమ్ముడయ్యాయి. రూ.60కి కొని.. కేవలం 20 రూపాయలకే అమ్మేశాడు.

మండుతున్న టమాటా ధరలు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కిలో 250 రూపాయలకు విక్రయాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అనేక నగరాల్లో రూ.100 కంటే ఎక్కువ అమ్ముడవుతోంది. రికార్డుస్థాయి టమాటా ధరలు చేరడంతో ప్రజలు కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అయితే టమాటా ధరలు ఈ రేంజ్‌లో ఉన్నా.. ఓ దుకాణదారుడు మాత్రం బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కేజీ టమాటా రూ.20కే విక్రయిస్తామని బోర్డు పెట్టాడు. ఇంకేముందు జనాలు ఎగబడ్డారు. 550 కేజీల టమాటాను క్షణాల్లో కొనేశారు. వివరాలు ఇలా..  

తమిళనాడులోని కడలూరుకు చెందిన రాజేష్‌ (38) అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తన షాపు వార్షికోత్సవం సందర్భంగా పేదలకు ఏలాగైనా సాయపడాలని అనుకున్నాడు. దీంతో బెంగుళూరు నుంచి రూ.60 పెట్టి 550 కేజీల టమాటాను తెప్పించాడు. 20 రూపాయలకే కేజీ టమాటా విక్రయిస్తామని బోర్డు పెట్టాడు. అయితే ఒకరికి ఒక కిలో మాత్రమే విక్రయిస్తానని ముందే చెప్పాడు. తక్కువ ధరకు లభించే టమాటా వల్ల ఎక్కువ మంది ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో ఒకరికి ఒక కిలో మాత్రమే అని కండీషన్ పెట్టామన్నాడు. 

రూ.20కే కేజీ టమాటా అనేసరికి ప్రజలు ఎగబడ్డారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రాజేష్ దుకాణం ముందు వాలిపోయారు. 550 కేజీల టమాటా క్షణాల్లో అమ్ముడుపోయింది. 2019లో తాను కూరగాయల వ్యాపారం మొదలు పెట్టానని రాజేష్‌ చెప్పుకొచ్చాడు. అప్పుడు ఉల్లిపాయలు ధరలు భారీగా ఉండేవన్నాడు. ఇదేతరహాలో కిలో ఉల్లి పది రూపాయలకే విక్రయించానని తెలిపాడు.

మధ్యప్రదేశ్‌లో ఓ సెల్‌ఫోన్ దుకాణదారుడు కూడా వినూత్న ప్రచారం మొదలుపెట్టాడు. తన షాపు స్మార్ట్ ఫోన్ కొంటే.. 2 కేజీల టమాటాలు ఫ్రీగా ఇస్తానని బోర్డు పెట్టేశాడు. అశోక్‌ నగర్‌లో అశోక్ అగర్వాల్ అనే సెల్‌ఫోన్ల వ్యాపారి ఈ ఆఫర్ ప్రకటించాడు. ఇక ఊర్లో స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకునేవారు ముందు ఈ షాపుకే వస్తున్నారు. రెండు కేజీల టమాటాలు ఫ్రీ అంటే.. రూ.300 నుంచి రూ.400 వరకు ఆఫర్ వచ్చినట్లేనని క్యూకడుతున్నారు. ఈ టమాటా ఆఫర్‌తో తమకు కస్టమర్లు బాగా పెరిగారని అశోక్ అగర్వాల్ చెబుతున్నాడు.