తెలంగాణ

ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టులు చేపడుతోందని బోర్డు చైర్మన్‌కు రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌ కుమార్‌ లేఖ రాశారు. లేఖతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల ఫోటోలను రజత్‌ కుమార్‌ జతపర్చి పంపారు. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎన్‌జీటీ స్టే విధించినా ఏపీ పనులు కొనసాగిస్తుందన్నారు.

డీపీఆర్‌ సన్నాహకాల పేరిట ప్రాజెక్టు పనులు చేస్తున్నారని ఆక్షేపించారు. పనులను కృష్ణా బోర్డు అడ్డుకోలేదన్నారు. ఎన్‌జీటీ ఆదేశించినా కృష్ణా బోర్డు నిజనిర్ధారణ కమిటీని ఏపీకి పంపలేదన్నారు. ఇటీవలి మంత్రివర్గ భేటీలో ఏపీ వైఖరిని ప్రభుత్వం తీవ్రంగా నిరసించినట్లు తెలిపారు. ఏపీ చర్యలతో కరవు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు, ఫ్లోరైడ్‌ ప్రాంతాలపై ప్రభావం పడుతుందన్నారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపి కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయబద్దమైన వాటా పరిరక్షించాలని కోరారు.