sharad pawar
జాతీయం రాజకీయం

మహారాష్ట్ర ఎన్సీపీలో మరో ట్విస్ట్.. శరద్ పవార్‌తో రెబల్స్ భేటీ

సరిగ్గా రెండు వారాల కిందట ఎన్సీపీ నుంచి చీలిపోయిన అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఓ వర్గం.. బీజేపీ-ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర సర్కార్‌లో చేరారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌, మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అబ్బాయి వేసిన ఎత్తుకు బాబాయి శరద్ పవార్ చిత్తయ్యారు. దేశ రాజకీయాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

ప్రధానాంశాలు:

  • బాబాయిపై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్
  • పార్టీపై పట్టుకోసం ఇరువురు నేతలు ప్రయత్నాలు
  • ఆశీర్వాదం తీసుకోడానికి వచ్చామన్న రెబల్స్

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఎన్సీపీ రెబల్స్.. ఆ పార్టీ అధినేత శరద్ పవార్‌ను ఆదివారం కలిశారు. తన అనుచరులతో కలిసి ముంబయిలో వైబీ చవాన్ సెంటర్‌కు వచ్చిన అజిత్ పవార్.. బాబాయితో సమావేశమయ్యారు. సోమవారం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా.. శరద్ పవార్‌ను రెబల్స్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవార్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ రెబల్ ఎంపీ ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మా దేవుడు.. మా నేత శరద్ పవార్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నాం’ అని అన్నారు.

‘మేము ఎటువంటి అపాయింట్‌మెంట్ తీసుకోకుండా ఇక్కడకు వచ్చాం.. సమావేశం కోసం శరద్ పవార్ వస్తారని మాకు తెలుసు.. అందుకే మేమంతా ఇక్కడకు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాం’ అని తెలిపారు. శరద్ పవార్‌ అంటే తమకు ఎంతో గౌరవమని, ఎన్సీపీ చీలిపోకుండా కలిసి ఉంచాలని కోరామని చెప్పారు. అయితే, ‘దీనికి శరద్ పవార్ స్పందించలేదు.. మేము చెప్పింది మాత్రమే విన్నారు.. ఆయనతో సమావేశం ముగిసిన తర్వాత వెళ్లిపోతున్నాం’ అని ప్రఫుల్ పటేల్ తెలిపారు.

అజిత్ పవార్ తన నివాసం దేవగిరి బంగ్లాలో తనకు విధేయులైన ఎన్సీపీ నేతలతో సమావేశమైన తర్వాత శరద్ పవార్‌ను కలిసేందుకు వైబీ చవాన్ సెంటర్‌కు వెళ్లారు. వర్షాకాల సమావేశానికి ముందు ప్రతిపక్ష పార్టీలతో సమావేశంలో ఉన్న జయంత్ పాటిల్‌ను కూడా సుప్రియా సూలే వైబి చవాన్‌కు పిలిచారు.

ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అజిత్ వెంట వచ్చారు. శరద్ పవార్, సుప్రియా సూలే, జయంత్ పాటిల్, జితేంద్ర అవద్ కూడా అక్కడే ఉన్నారు. జులై 2న శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసిన తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని బృందం ఆయనను కలవడం ఇదే మొదటిసారి.

రెండు రోజుల కిందట పవార్ అధికారిక నివాసం సిల్వర్ ఓక్‌కు వెళ్లిన అజిత్.. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న తన పిన్ని ప్రతిభ పవార్‌ను పరామర్శించారు. ప్రతిభ పవార్‌తో అజిత్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. 2019లో అజిత్ బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. మళ్లీ వెనక్కి రావడంలో ఆమె కీలక భూమిక పోషించారు. అయితే, ఎప్పుడూ కూడా ఆమె తెర వెనుక ఉన్నారు తప్పా.. రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు.