దేశంలోని ప్రభుత్వ వైద్య సిబ్బంది తీరు రోజురోజుకు దారుణంగా మారుతోంది. ఎక్కడ చూసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో రోగులు అత్యవసర పరిస్థితిలో ఉన్నా.. అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక చాలా చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్‌లదే రాజ్యం. వాళ్లే సెలైన్లు పెట్టేస్తారు. వాళ్లే వైద్యం చేసేస్తారు. వాళ్లే డాక్టర్లుగా చెలామణి అవుతుంటారు.
తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఏరియా కమ్యూనిటీ ఆసుపత్రిలో కూడా జరిగింది ఇదే. స్వీపర్లు రోగులకు వైద్యం చేస్తుండగా న్యూస్ 18 కెమెరాకు చిక్కారు. ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగులకు స్వీపర్లే గ్లూకోస్ ఎక్కిస్తున్నారు, రోగులకు వైద్యం చేస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వార్తలు వచ్చినా ఈ ఆసుపత్రి తీరు మాత్రం మారడం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం మానుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంపౌండర్లు డాక్టర్లుగా మారి రోగులకు కట్లు కట్టడం, కుట్లు వేయడం లాంటివి చేసిన వార్తలు కూడా పలుమార్లు వచ్చాయి. దీనిపైన అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారంలో భాగంగా న్యూట్రిషన్ కిట్స్ అందిస్తున్న క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులకు గర్భిణీ స్త్రీల సంఖ్య పెరిగింది. గర్భిణీ స్త్రీలకు సరిపడా గైనకాలజిస్ట్, ఆసుపత్రిలో లేకపోవడంతో వైద్యం కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలో వైద్యులు సరిగా లేరని పేదలకు వైద్యం అందడం లేదని కొన్ని ఆసుపత్రిలో అయితే కనీసం తాగడానికి నీరు కూడా లేవని ఈ మధ్యకాలంలో జరిగిన జడ్పీ సమావేశంలో సైతం.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు సరిపడా వైద్య సిబ్బందిని లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు స్వీపర్లే డాక్టర్లుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లలేని నిరు పేదలు.. ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. తీరా ఇక్కడికి వస్తే చాలీచాలని వైద్య సిబ్బందితో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నారు. మరోవైపు ఆరోగ్య శాఖపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని.. కానీ వాస్తవానికి ఇదీ పరిస్థితి అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.