ఆగస్టు 29, 30 తేదీల్లోగ్రూప్ – 2 నిర్వహించనున్నారు. అయితే పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా కాకుండా… ఓఎంఆర్ పద్ధతిలోనే
TSPSC group 2 Exam: పరీక్షల విషయంలో స్పీడ్ పెంచుతోంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికే గ్రూప్ – 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 వంటి పరీక్షలను పూర్తి చేయగా…. గ్రూప్ – 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించునుంది. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ పడుతున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో భారీగా సెంటర్లను ఎంపిక చేసే పనిలో ఉంది. అయితే పేపర్ లీకేజీ కారణాల రీత్యా… కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారని భావించారు. కానీ ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు స్పష్టం చేశాయి.మరోవైపు గ్రూప్ – 2 పరీక్ష నిర్వహణ కోసం సెంటర్లుగా నిర్ణయించిన అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ సెలవు దినాలు ఉంటాయని పేర్కొంది. గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 5.5 లక్షల మంది దరఖాస్తు చేశారు. త్వరలోనే పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేయనుంది టీఎస్పీఎస్సీ. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్వూలు లేవు…
ఇక గ్రూప్ 2 పరీక్షను మొత్తం 600 మార్కులకు నిర్వహించనున్నారు. ఇందులో 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 150 మల్టిపుల్ ఛాయిల్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్ పరీక్ష కాల పరిమితి రెండున్నర గంటలు ఉంటుంది. పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, పేపర్-2లో చరిత్ర, పాలిటీ, సొసైటీ, పేపర్-3లో ఎకానమీ, డెవలప్‌మెంట్, పేపర్-4లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుపై ప్రశ్నలుంటాయి. గతంలో మాదిరిగా ఇంటర్వూలు లేవు.
మొత్తం నాలుగు పేపర్లు ఉండగా… పేపర్ 2 లో స్వల్ప మార్పులు ఉన్నాయి. ఇక పేపర్3లో చాలా మార్పులే చేశారు. పేపర్1, 4 లో ఎలాంటి మార్పులు లేవు. పేపర్-2లోని పార్టు-2లో గతంలో ఉన్న ‘భారత రాజ్యాంగం – కొత్త సవాళ్లు’… ‘భారత రాజ్యాంగం – సవరణల విధానం, సవరణ చట్టాలు’గా మారింది. ‘దేశంలో న్యాయవ్యవస్థ’ సబ్జెక్టులో జ్యుడీషియల్ రివ్యూ, సుప్రీంకోర్టు, హైకోర్టు అంశాలు అదనంగా వచ్చాయి. ప్రత్యేక రాజ్యాంగ నియమావళిలో మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్ వర్గాలు… జాతీయ కమిషన్లలో మహిళా, మైనార్టీ, మానవ హక్కులను చేర్చారు. జాతీయ సమైక్యత, సవాళ్లు, అంతర్గత భద్రత, అంతర్రాష్ట్ర సవాళ్లు సబ్జెక్టుగా వచ్చాయి. పేపర్-3లోనూ ఒక్కోపార్టులో పలు అంశాలను సిలబస్‌లోకి చేర్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ ను చూడొచ్చు.
గ్రూప్ 2లో భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు:
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 పోస్టులు – 11
కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ – 59
-ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో నయిబ్ తహసిల్దార్ పోస్టులు – 98
-రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్‌లో సబ్-రిజిస్ట్రార్ ఖాళీలు – 14
రిజిస్ట్రార్ ఆఫ్ కో- ఆపరేటివ్ సొసైటీస్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ కమిషనర్ ఫర్ కో-ఆపరేషన్ పోస్టులు - 63
కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఖాళీలు – 09
పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో మండల పంచాయత్ ఆఫీసర్ (ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్) పోస్టులు – 126
ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్- 97
హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్ డిపార్ట్‌మెంట్‌లో- అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ – 38
-జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీలు – 165
-లెజిస్లేటివ్ సెక్రెటేరియట్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 15
-ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 25
-న్యాయ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 07
-తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 02