రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి దక్షిణ కొరియా, సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి నగరాల్లో నీటి వనరులు ఉన్న చోట పెద్ద పెద్ద వాటర్ ఫౌంటేన్లు, పబ్లిక్ గార్డెన్లలో లేజర్ షోలు, అమ్యూజ్ మెంట్ పార్కులను దశలవారీగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అంతర్జాతీయ హంగులతో చేపట్టేందుకు వీలుగా ఆయా ప్రాజెక్టులకు సంబంధించి సింగపూర్, హాంకాంగ్ కన్సల్టెంట్ల సేవలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో నీటి వనరులు పెరగడంతో జల పర్యాటకాన్ని పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఇందులో ముఖ్యంగా పిల్లల్ని ఆకర్షించే ఏర్పాట్లకు ప్రాధ్యాన్యం ఇవ్వాలని భావిస్తోంది.కరీంనగర్లోని మానేరు రివర్ ఫ్రంట్తోపాటు ఇతర ప్రదేశాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, టూరజం కార్పొరేషన్ ఎండీ మనోహర్ లాల్ తో కూడిన బృందం దక్షిణ కొరియా, సింగపూర్ లలోని పర్యాటక కేంద్రాలపై ఇటీవల వారం రోజుల పాటు అధ్యయనం చేసి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన సియోల్ లోని బిగ్ ఓ షోని మించిన మ్యూజికల్ ఫౌంటేన్ ని మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ షోను చూసేందుకు రాష్ట్ర ప్రజలంతా ఆసక్తి చూపించేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి కోసం దక్షిణ కొరియా, సింగపూర్ వెళ్లి ప్రఖ్యాత ప్రదేశాల్ని తమ బృందం పరిశీలించిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ తెలిపారు. పనులు 40 శాతం పూర్తయిన మానేరు రివర్స్ ఫ్రంట్ తో పాటు మహబూబ్ నగర్ లో, ఖమ్మం దగ్గర మున్నేరు నదీ తీరంలో పెద్ద పెద్ద మ్యూజిక్ ఫౌంటేన్లను, హన్మకొండ భద్రకాళి ఆలయం నుంచి గుట్టపైకి రోప్ వే, హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ – సంజీవయ్య పార్కు ప్రాంతాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అనుకున్నామన్నారు.
అదే విధంగా నగరాలు, పెద్ద పట్టణాల్లో లేజర్ షోలు ఏర్పాటు ఆలోచన ఉందన్నారు. బెంజ్ కార్లతో క్యారవాన్ టూరిజానికి కొరియాలో ప్రాధాన్యం ఉందన్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వంటి చోట్లకు వెళ్లి వచ్చేలా బెంజ్ కార్లకు ఆర్డర్ ఇవ్వాలన్న యోచన ఉందని వివరించారు. ఈ ప్రణాళికలు దశల వారీగా కార్యరూపం దాల్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైమా మరికొన్నాళ్లలో రాష్ట్ర పర్యాటక రూపు రేఖలు మారిపోతాయని వెల్లడించారు.