పంచంలోని చారిత్రాత్మక విద్యాసంస్థల్లో ఆంధ్రా మెడికల్ కళాశాల ఒకటి. షార్ట్ కట్‌లో ఏఎంసీ అని పిలుచుకునే ఈ వైద్య కళాశాలలో చదివిన వారు దాదాపు 80 దేశాలలో ప్రసిద్ధ వైద్యులుగా పేరు గడిస్తున్నారు. అందుకే ప్రపంచ మేటి కళాశాలల్లో ఒకటిగా ఖచ్చితంగా చెప్పక తప్పని పరిస్తితి. 100 ఏళ్ల క్రితం డిప్లొమా మెడికల్ కోర్సు అందించే సాధారణ స్కూల్‌గా ప్రారంభమై ఇంతింతై వటుడింతై అన్నట్టు వందేళ్ల లో మహోన్నతంగా ఎదిగింది. 1923లో కేవలం 32 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల, ఇప్పటివరకు 20 వేల మంది ప్రపంచ స్థాయీ వైద్యులను అందించి చరిత్ర సృష్టించింది.
వీరిలో దేశంలోని అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మశ్రీ వంటివి అందుకున్న వారెందరో ఉన్నారు..మద్రాస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రా ప్రాంతంలో ఒక్క మెడికల్ కళాశాల కూడా ఉండేది కాదు. దీంతో తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల ప్రారంభించాలన్న డిమాండ్ ను అప్పటి మద్రాస్ అంగీకరించింది. విశాఖపట్నం లో ఒక వైద్య కళాశాలను నిర్మించి, నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కళాశాల నిర్మాణానికి ముందు ప్రస్తుతం ఆంధ్రా మెడికల్ కళాశాల ఉన్న ప్రాంతంలో మద్రాస్ స్టాన్లీ మెడికల్ కాలేజీకి అనుబంధంగా లైసెన్సీయేట్ మెడికల్ సర్టిఫికెట్ -ఎల్‌ఎంపీ కోర్సును ప్రస్తుత ఫిజియాలజీ ల్యాబ్‌లో నిర్వహించేవారట.
మొదట్లో దానినే మెడికల్ స్కూల్‌గా పిలిచేవారట. ఈ స్కూల్ నిర్మాణాన్ని తొలుత మద్రాస్ ప్రభుత్వం ప్రారంభిస్తే ఆ తరువాత గోడె సంస్థాన జమీందార్లు పూర్తి చేశారు. మొదట మెడికల్ స్కూల్ నిర్వహిస్తున్న భవనంలోనే 1923 జూలై 19న 32 మంది విద్యార్థులతో కళాశాలను స్టార్ట్ చేసారు. మొత్తం 50 సీట్ల తో కళాశాల ప్రారంభం అయినా కేవలం 32 మంది విద్యార్థులు మాత్రమే అప్పట్లో వైద్య విద్యలో చేరేందుకు ఆసక్తి చూపారు. పీయూసీలో మెరిట్ వున్న విద్యార్థులకు ఎంబీబీఎస్, మెరిట్ లేని విద్యార్థులకు ఎల్‌ఎంపీ కోర్సులలో సీట్ లభించేది.
మొదట ఈ కళాశాలను వైజాగపట్నం మెడికల్ కాలేజీగా పిలిచేవారు. ప్రారంభంలో మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఈ కళాశాల నడిచింది. 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ తరువాత ఆంధ్రా విశ్వ విద్యాలయానికి అనుబంధంగా ఆంధ్రా మెడికల్ కళాశాల గా రూపాంతరం చెందింది. 1940లో ఆంధ్రా విశ్వ విద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ సీఆర్ రెడ్డి వైజాగపట్నం మెడికల్ కాలేజీ పేరును ఆంధ్ర మెడికల్ కళాశాలగా మారుస్తూ గెజిట్ తీసుకొచ్చారు. 1
986 వరకు ఏయూకు అనుబంధంగా కొనసాగింది. తరువాత తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దాని పరిధిలోకి ఆంధ్రా మెడికల్ కళాశాలను తీసుకొచ్చారు. ఆంధ్రా మెడికల్ కళాశాలకు ప్రస్తుతమున్న భవనాన్ని 1955లో రాజా ఆఫ్ పానగల్ నిర్మించారు. ప్రారంభంలో తొలి ప్రిన్సిపాల్‌గా కల్నల్ ఎఫ్‌జే అండర్సన్ సేవలు అందించగా ఇప్పటివరకు మెడికల్ కాలేజీకి 71 మంది ప్రిన్సిపాల్స్‌గా పనిచేశారు. ప్రస్తుతం డాక్టర్ జి.బుచ్చిరాజు 71వ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు.కళాశాల వందేళ్ల చరిత్రలో సుమారు 20 వేల మంది ఆంధ్ర మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సులు ను అభ్యసించారు. ఈ 20 వేల మందిలో సుమారు ఐదు వేల మంది వరకు విదేశాల్లో స్థిరపడ్డారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూ కే లతో పాటు దాదాపు 80 దేశాల్లో ప్రముఖ వైద్యులుగా రాణిస్తున్న పలువురు ఆంధ్ర వైద్య కళాశాల విద్యార్థులమని చెప్పుకోవడానికి గర్వపడిన సందర్భాలు, ప్రపంచ వేదికలు ఎన్నో ఉన్నాయి.
ఆంధ్ర మెడికల్ కళాశాల అలుమ్ని విద్యార్థులు రాజకీయ, సేవా, కళా రంగాల్లోనూ పేరు గడించారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎంతో మంది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా విజయం సాధించిన నేపథ్యం ఆంధ్రా యూనివర్సిటీ కి ఉంది. అనకాపల్లి ఎంపీగా ఉన్న సత్యవతి, మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజు ఆంధ్రా మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులే. గతంలో మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న కృపారాణి కూడా ఈ కళాశాల విద్యార్థినే. గతంలోనూ అనేక మంది మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా సేవలందించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆంధ్రా మెడికల్ కళాశాల 100 ఏళ్ల పూర్తి సందర్భంగా పూర్వ ప్రముఖ విద్యార్థులందరిని ఒకే వేదికపై కి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది.