తెలంగాణ

నేటితో రైతుబంధు సాయం పంపిణీ పూర్తి

హైదరాబాద్‌ : రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వానాకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా అన్నదాతల ఖాతాల్లో జమవుతోంది. నేటితో రైతుబంధు సాయం పంపిణీ కార్యక్రమం పూర్తి కానుంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 63.25 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించింది. గత ఏడాదితో పోల్చితే 2,81,865 మంది కొత్త రైతులను లబ్ధిదారుల జాబితాలో చేర్చింది.

గురువారం వరకు 30 ఎకరాల లోపు ఉన్న వారందరికీ రైతుబంధు సాయం అందగా.. 30 ఎకరాలకు పైబడి ఉన్నవారందరికీ చివరి రోజైన శుక్రవారం ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటి వరకు కోటి 45లక్షల 98వేల ఎకరాలకు సంబంధించి.. 60,74,973 మంది రైతుల ఖాతాల్లో రూ.7,298 కోట్లు జమయ్యాయి. పెట్టుబడిన సాయం పంపిణీ ఈ నెల 15న ప్రారంభమైంది. మొదట తొలిరోజు ఒక ఎకరం ఉన్న రైతుల ఖాతాల్లో నగదు సాయం జమ చేసింది. ఆ తర్వాత విడుదల వారీగా భూముల విస్తీర్ణం బట్టి ఆయా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ వస్తోంది.