ఆంధ్రప్రదేశ్

ఏపీలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు రద్దు

మార్కుల నిర్ణయానికి హైపవర్‌ కమిటీ నియామకం
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు నిర్దేశించిన జూలై 31 లోగా టెన్త్, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి సాధ్యం కాదని, అందుకని పరీక్షలను రద్దుచేస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. విజయవాడలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘పదిరోజుల్లో మార్కుల ఇవాల్యుయేషన్‌ స్కీమ్‌ను రూపొందించి జూలై 31లోగా ఫలితాలు ప్రకటించేలా గురువారం సుప్రీంకోర్టు ప్రకటించిన టైమ్‌ షెడ్యూల్‌లో రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల సాధ్యం కాదు. అన్ని రాష్ట్రాలకు కామన్‌గా ఇదే టైమ్‌ షెడ్యూల్‌ ఉంది. పైగా జూలై 31 తరువాత ఉన్నతవిద్య ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించేలా యూజీసీని కూడా న్యాయస్థానం ఆదేశించింది.

ఈ తరుణంలో ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల అవకాశాలను మన విద్యార్థులు  నష్టపోరాదు. అందుకే రెండో ఆప్షన్‌గా పరీక్షల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నాం..’ అని మంత్రి వివరించారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలతో పాటు టెన్త్‌ పరీక్షలను కూడా రద్దుచేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు మార్కులను నిర్ణయించడం సహా ఇతర అంశాలకు సంబంధించి ఏ విధానాలను అనుసరించాలో సూచనలు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని వేయనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి సందిగ్ధత లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల నిర్వహణే మొదటి ప్రాధాన్యమని, కానీ కోర్టు పేర్కొన్న టైమ్‌ షెడ్యూల్‌లో పరీక్షలు, ఫలితాల ప్రకటన సాధ్యంకాదు కనుకనే రెండో ఆప్షన్‌గా పరీక్షలను రద్దు చేస్తున్నామని స్పష్టం చేశారు. 

హైపవర్‌ కమిటీ సూచనల మేరకు మార్కుల కేటాయింపు
‘మార్కులు ఎలా తీసుకోవాలన్న దానిపై సీబీఎస్‌ఈ సవివర గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. ఎలా అసెస్‌మెంటు చేయాలి? ఏయే పరీక్షలను పరిగణనలోకి తీసుకోవాలి? అన్న అంశాలను అందులో పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర  కేవలం ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల మార్కులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఏవిధంగా అసెస్‌మెంటు చేయాలి? ఎలా మార్కులు తీసుకోవాలో ఆ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.