brahmani
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

హిందూపురం నుంచి బ్రాహ్మణీ..?

దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు,  విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు మనవరాలు, నందమూరి బాలకృష్ణ కుమార్తె, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కోడలు,  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సతీమణి నందమూరి బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం చేయనున్నారా అంటే రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానం వస్తున్నది. వచ్చే ఎన్నికలలో నారా బ్రాహ్మణి రాజకీయాలు అరంగేట్రం చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  ఆమె రాజకీయ ప్రవేశంపై నారా, నందమూరి కుటుంబాలతో పాటు తెలుగు దేశం పార్టీలో చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  దీంతో ఆమె ఎక్కడ నుండి బరిలో దిగనున్నారు? ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న బ్రాహ్మణి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం వెనకున్న కారణాలేంటి? అన్న అనుమానాలు సహజంగానే అందరిలో వ్యక్తమౌతున్నాయి.నారా బ్రాహ్మణి విషయానికి వస్తే ఇప్పటికే ఆమె సమర్ధురాలిగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

యూఎస్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసిన బ్రాహ్మణి ఇప్పటికే హెరిటేజ్ గ్రూపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా తన తండ్రి చైర్మన్ గా ఉన్న బసవతారకం క్యాన్సర్ హాస్పటల్  ట్రస్ట్ కి బోర్డు సభ్యురాలిగా  కొనసాగుతున్నారు. చిన్న నాటి నుంచి ఇటు సినీ, అటు రాజకీయ రంగాలను దగ్గరగా చూసిన నారా బ్రాహ్మణి తనకు ఇష్టమైన వ్యాపార రంగంలోకి వెళ్లి దిగ్విజయంగా ముందుకెళ్తున్నారు. హేరిటేజ్ ఫుడ్స్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పలు సేవా కార్య క్రమాలను చేపట్టడంలో కూడా ఆమె ముందున్నారు. హేరిటేజ్ సంస్థలో పనిచేస్తున్న పేద కార్మి కుల పిల్లల చదువు కోసం ఆమె ఎంతో తపిస్తారని  ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. ఆమె సమర్ధతకి నిదర్శనమే అప్పటికే లాభాలలో ఉన్న హెరిటేజ్ సంస్థను ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ ముందుకెళ్లడం.ఇప్పుడు ఆమె రాజకీయాలలో కూడా అరంగేట్రం చేయనున్నారని అంటున్నారు.

నిజానికి ఈ ప్రచారం  కొత్తదేం కాదు. గతంలో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి బ్రాహ్మణిని పోటీచేయిస్తే పరిస్థితి ఎలా ఉంటుందని టీడీపీ సర్వేలు చేయిస్తున్నదని కూడా ప్రచారం జరిగింది. చంద్రబాబుకు, కేశినేని నాని మధ్య చాలా గ్యాప్ రావడానికి కూడా బ్రాహ్మణి విషయం బయటికి పొక్కడమేనని అప్పట్లో నెట్టింట్లో  వదంతులు షికార్లు చేశాయి. అయితే ఆమె రాజకీయ ప్రవేశం అప్పటికి కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది.  ఇప్పుడు మరోసారి బ్రాహ్మణి రాజకీయాలలోకి రానున్నారని, అది కూడా అసెంబ్లీకి పోటీ చేయనున్నారని ప్రచారం మొదలైంది. తన తండ్రి నందమూరి బాలక్రిష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచే 2024 ఎన్నికల్లో బ్రాహ్మణి పోటీ చేయవచ్చన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ.హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకూ అంతా పురుష ఎమ్మెల్యేలే ఉన్నారు.

మహిళలు పోటీ చేసినా గెలవలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా మహిళలకు ఇక్కడ టికెట్ ఇవ్వడం లేదు. అందుకే ఈసారి వైసీపీ ఈ మహిళా సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుకోవాలని చూస్తుంది. గతంలో వైసీపీ నుండి 2014లో నవీన్ నిశ్ఛల్, 2019లో ఇక్బాల్ బాలయ్యపై పోటీ చేసి ఓడిపోయారు. జగన్ వేవ్ లో కూడా బాలయ్య గెలవగా.. ఇప్పుడు మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉన్నారు బాలయ్య. అయితే, వైసీపీ హిందూపురం ఇంచార్జి పదవిని మహిళా నేత టీఎన్ దీపికకు అప్పగించింది.తెలుగుదేశం కూడా ఇక్కడ మహిళా నేతనే బరిలోకి దించాలని భావిస్తున్నదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు నారా బ్రాహ్మణి బెస్ట్ అప్షన్ గా తెలుగుదేశం నిర్ణయించిందని ప్రచారం జరుగుతున్నది. అంతకు ముందు తన తాత, ఆ తరువాత తండ్రి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో ఇప్పుడు కుమార్తె పోటీకి దిగడం మంచి పరిణామమే అవుతుందని టీడీపీ నేతలు   భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మరి అప్పటి లాగా ఇది కూడా ప్రచారంగానే మిగిలిపోతుందో.. లేక ఈసారి నిజంగానే బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం ఉంటుందో చూడాల్సి ఉంది.