- డాటాబేస్ నుంచి వివరాలు డిలీట్ చేస్తున్న చైనా
- వుహాన్‌లో కరోనా కేసుల వివరాలు మాయం
- అమెరికా వైరాలజిస్టు జెస్సీ బ్లూమ్ పరిశోధనలో వెల్లడి
వాషింగ్టన్, జూన్ 24: కరోనా మూలాలను చైనా తుడిచేస్తున్నది. వైరస్ వెలుగు చూసిన తొలినాళ్లలో చైనా విడుదల చేసిన పరిశోధనల వివరాలను అంతర్జాతీయ డాటాబేస్ నుంచి తొలగిస్తున్నది. కరోనా పుట్టుక, పరిణామ క్రమం తెలుసుకోవడంలో కీలకమైన ఈ సమాచారాన్ని చైనా డిలీట్ చేస్తున్నట్టు అమెరికాలో ప్రముఖ వైరాలజిస్టు జెస్సీ బ్లూమ్ జరిపిన పరిశోధనలలో వెల్లడైంది. డిలీట్ చేసిన నివేదికల్లో కరోనా తొలినాళ్లలో వుహాన్‌లో నమోదైన కేసులకు సంబంధించిన సమాచారమే ఎక్కువగా ఉందని బ్లూమ్ అన్నారు. వుహాన్ మార్కెట్‌లో కరోనా వెలుగుచూడకముందే నగరంలో పలుచోట్ల వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని తన నివేదికలో పేర్కొన్నారు. కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్‌వో మళ్లీ దర్యాప్తు చేయడానికి సిద్ధపడుతున్న వేళ చైనా ఈ కుటిల యత్నాలు చేయడం వైరస్ వ్యాప్తికి చైనానే కారణం అన్నవాదనలకు మరింత బలాన్నిస్తున్నది.
ఒక్క డోసుతోనూ 60 శాతం రక్షణ
ఫైజర్ లేదా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను ఒక డోసు తీసుకున్నా కూడా కరోనా వైరస్ నుంచి దాదాపు 60 శాతం రక్షణ లభిస్తుందని వెల్లడైంది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. 60 ఏండ్లు, ఆ పైబడిన వారైన 10,412 మందిలో టీకా ప్రభావాన్ని పరిశీలించారు. తొలిడోసు తీసుకున్న తర్వాత 4 నుంచి 7 వారాల వ్యవధిలో రక్షణ ప్రారంభమవుతున్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు.
స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌తో కరోనా టెస్టు
ముక్కు నుంచి స్వాబ్ నమూనాలు తీసుకోకుండా స్మార్ట్ ఫోన్ల తెరలపై పడే తుంపర్లతో కరోనా వైరస్‌ను గుర్తించే విధానాన్ని యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని ఫోన్ స్క్రీన్ టెస్టు అని పిలుస్తున్నారు. పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు ఫోన్‌లపై ఉండే స్వాబ్ నమూనాలను పరీక్షించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి తిరిగి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా 81 శాతం మందిలో అవే ఫలితాలు వచ్చాయి. ఫోన్‌పై స్వాబ్ నమూనాలను పరీక్షించడానికి చిలీకి చెందిన స్టార్టప్ డయాగ్నసిస్ బయోటెక్ అనే సంస్థ యంత్రాన్ని తయారు చేస్తున్నది.
43సార్లు కరోనా పాజిటివ్
బ్రిటన్‌కు చెందిన 72 ఏండ్ల వయసున్న డేవిడ్ స్మిత్ ఒక్కసారో రెండుసార్లో మూడుసార్లో కాదు.. ఏకంగా 43 సార్లు కరోనా బారిన పడ్డారు. జీవితం మీద ఆశ చాలించుకొని అందరి దగ్గరా అప్పగింతలు కూడా తీసుకున్నారాయన. కానీ, చిట్టచివరికి 10 నెలల తర్వాత కరోనా నెగెటివ్ వచ్చి.. కోలుకున్నారు. బ్రిస్టల్‌కు చెందిన డేవిడ్ స్మిత్.. గత ఏడాది తొలిసారిగా కరోనా సోకింది. అందరిలాగే హోంక్వారంటైన్‌లో ఉన్నారు. కొన్నిరోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చింది.మళ్లీ కరోనా లక్షణాలు ఉండటంతో మళ్లీ చికిత్స తీసుకున్నారు. ఇలా.. ఏకధాటిగా 305 రోజులపాటు ఆయనను కరోనా వెంటాడింది.చివరికి అమెరికా కంపెనీ రీజెనరన్ తయారుచేసిన సింథటిక్ యాంటీబాడీల కాక్‌టెయిల్ ఔషధాన్ని వరుసగా 45 రోజులపాటు వాడిన తర్వాత ఆయన కోలుకున్నారు.