తెలంగాణ

పూర్తిస్థాయిలో పనిచేయనున్న పాస్‌పోర్టు సేవాకేంద్రాలు

హైదరాబాద్‌: విదేశాలకు వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలోని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు నేటి నుంచి పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయడంతో క్రమంగా ఒక్కోసేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. బుధవారం ఎంఎంటీఎస్‌ రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభంకాగా, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పూర్తి సమయంపాటు నడవనున్నాయి. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, మినీ సర్వీస్‌ సెంటర్లలో సేవలు ప్రారంభమవుతాయని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి బాలయ్య తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకితోపాటు నిజామాబాద్‌లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, కరీంనగర్‌లోని మినీ కేంద్రంలో సగం అపాయింట్‌మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచామన్నారు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయిలో అందిస్తున్నట్లు చెప్పారు. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌, సిద్దిపేట, వికారాబాద్‌, భువనగిరి, వనపర్తి, మహబూబాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, కామారెడ్డిలోని పాస్‌పోర్ట్‌ కేంద్రాల్లో ఈ నెల 10 నుంచే సేవలను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.