tet
తెలంగాణ ముఖ్యాంశాలు

టెట్.. సెట్ లకు అంతా రెడీ

తెలంగాణలో మరోసారి టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో పరీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నడుస్తోంది. అయితే డీఎస్పీ పై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. గతేడాది టెట్ పరీక్ష నిర్వహించిన విద్యాశాఖ… వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రకటన జారీ కాలేదు. ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించి… ఏడాది పూర్తి అయింది. దీంతో మరోసారి టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్ష నిర్వహణపై కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ… అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్షను సెప్టెంబర్‌ మూడోవారంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయించింది.

మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో టెట్ నిర్వహణపై విద్యాశాఖ వేగం పెంచింది. సెప్టెంబర్‌ 15 లోపు లేదా ఆ తర్వాత రోజుల్లో పరీక్షను నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణపై ఓ అంచనాతో ఉన్న అధికారులు… ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. నోటిఫికేషన్‌ జారీ, దరఖాస్తుల స్వీకరణ, ఇతర ప్రక్రియలు కలిపి పరీక్ష రోజు నాటికి ఎంత సమయం పడుతుందనే దానిపై కూడా సర్కార్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫలితాల వెల్లడికి 20 రోజులకు పైబడి టైం పట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. గతేడాది మార్చి 24న నోటిఫికేషన్‌ జారీ చేయగా.. పరీక్షను జూన్‌ 27న నిర్వహించిన సంగతి తెలిసిందే.

తాజా టెట్‌ నిర్వహణతో అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చే అకాశం ఉందిఇక రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016 మే 22, 2017 జులై 23, 2022 జూన్‌ 12న టెట్ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఏడాది గడుస్తున్నందున మళ్లీ టెట్‌ జరపాల్సి ఉంది. ఏడాది కాలంలో డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులైన వారు 20వేలకు పైగా ఉన్నారు. గత కొంతకాలంగా మరో టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ పరీక్షను జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు అశావాహులు. ఈసారి నిర్వహించబోయే పరీక్షకు కూడా దాదాపు 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.నిబంధనల ప్రకారం డీఎడ్‌, బీఎడ్‌ పాసైన వారు టెట్‌లో ఉత్తీర్ణులైతేనే ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించే టీఆర్‌టీ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. టెట్‌లో వచ్చిన మార్కులకు టీఆర్‌టీ ర్యాంకింగ్‌లో 20 శాతం వెయిటేజీ ఉన్నందున టెట్‌లో అత్యధిక మార్కులు దక్కించుకోవడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు. టెట్ లో అర్హత లేకపోతే ఈ పరీక్షలకు హాజరుకాలేరు.పైగా టెట్ ఉత్తీర్ణత లేకపోతే ప్రైవేటు పాఠశాలల్లో కూడా బోధన చేయడానికి వీలుండదు.
ఉస్మానియా నోటిఫికేషన్
తెలంగాణ సెట్ 2023 నోటిఫికేషన్ ను ఉస్మానియా వర్సిటీ విడుదల చేసింది. అక్టోబర్ లో పరీక్ష నిర్వహించనున్నారు.తెలంగాణ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఆగ‌స్టు 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవ‌చ్చు. సెట్ ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు, పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో మూడు గంటల పాటు ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. టీఎస్ సెట్ నోటిఫికేష‌న్‌తో పాటు ఇతర స‌మాచారం కోసం www.telanganaset.org, www.osmania.ac.in అనే వెబ్‌సైట్లను విజిట్ చేయవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ లో టీఎస్ సెట్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది మార్చి 14, 15, 17వ తేదీల్లోనూ టీఎస్ సెట్ పరీక్షను నిర్వహించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ సెట్ పరీక్షలకు మొత్తం 50,256 మంది అప్లై చేసుకోగా, 40,128 మంది హాజరయ్యారు.