ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వివాదంలో ఇరుక్కున్నారా? లేక కావాలనే ఇరికించారా? పుట్టపర్తి నియోజకవర్గంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఆయన కంపెనీల్లో అవకతవకలు, బ్యాంకులకు వందల కోట్లు ఎగవేశారన్న వ్యవహారం జనం మధ్య నలుగుతోంది. వాస్తవంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మినహా ఎవరితోనూ పెద్దగా విభేదాలు లేవన్నది లోకల్ టాక్. నాలుగేళ్ళ నుంచి సాఫీగా నెట్టుకొస్తున్న ఎమ్మెల్యే గురించి హఠాత్తుగా వివాదాలు తెరపైకి రావడం సంచలనమవుతోంది. శ్రీధర్ రెడ్డికి చెందిన ఆస్తుల్ని బ్యాంకులు వేలం వేయబోతున్నాయని, ఆయన దివాలా తీసే పరిస్థితి వచ్చిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షాలు స్తెతం బ్యాంక్ నోటీసుల్ని ఆయుధంగా చేసుకుని ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నాయి. అటు ఈ ఏడాదిలో జరిగిన అతి పెద్ద స్కాం అంటూ పల్లె రఘునాథరెడ్డి ఆల్రెడీ ప్రచారం మొదలెట్టేశారు.
ఎన్నికల అఫిడవిట్‌లో ఎమ్మెల్యే ఆస్తుల వివరాల్ని తప్పుగా చూపించారని..అసలు వైసీపీ నుంచే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు పల్లె. దీనిపై సిట్టింగ్ జడ్జి విచారణకు డిమాండ్ చేస్తోంది ప్రతిపక్షం.పరిస్థితి చేయిదాటి పోవడంతో … మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు శ్రీధర్‌రెడ్డి. వివిధ బ్యాంకులకు కట్టాల్సిన రుణాలు ఏప్రిల్ 30 నాటికి వడ్డీతో కలిపి 908 కోట్లు అయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే హామీదారుగా ఉన్న కంపెనీ రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఆగస్టు 18న ఆయన ఆస్తులను వేలం వేయబోతున్నట్టు ఈనెల 2న నోటీసులు ఇచ్చింది కెనరా బ్యాంకు. అయితే… రెండో తేదీన నోటీసులు వస్తే…ఇప్పుడెందుకు రచ్చ మొదలైంది? అసలీ విషయం ఎలా బయటికి వచ్చిందన్నది ఎమ్మెల్యేకు అర్ధం కావడంలేదట. సొంత పార్టీ నాయకులే… ఇలా అంతర్గత విషయాలను బయటపెట్టి ప్రత్యర్థుల చేతికి అస్త్రాలను ఇస్తున్నారని అనుమానిస్తున్నారట ఆయన.
ఇందులో రాజకీయంగా తనను దెబ్బతీసే కుట్ర ఉందన్నది శ్రీధర్‌రెడ్డి అభిప్రాయంగా చెబుతున్నారు. వ్యాపారం అన్నాక ఒడి దుడుకులు సహజమని, అలాంటిది తనను రోడ్డు మీదికి లాగడానికే.. సొంత పార్టీ మనుషులు ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పుట్టపర్తి ఎమ్మెల్యే. తమ కంపెనీ ఏపీ, తెలంగాణ కర్ణాటకల్లో పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు నిర్వహించిందని, దీనికి సంబంధించి 1500 కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉందని చెబుతున్నారట ఎమ్మెల్యే. మూడు నెలల ఈఎంఐలు బకాయి పడ్డందుకే రచ్చ చేస్తున్నారని, వైసీపీలోని కొందరు కావాలని ఈ విషయంలో లీకులు ఇచ్చి తన మీద కక్ష సాధించాలనుకుంటున్నారని సన్నిహితుల దగ్గర అంటున్నారట శ్రీధర్‌రెడ్డి. ఆ కట్టప్ప ఎవరన్న విషయమై పుట్టపర్తి నియోజకవర్గంలో హాట్ డిబేట్ జరుగుతోంది. బ్యాంక్ నోటీసులతో ఎమ్మెల్యే ఇరుకున పడతారో… లేక ఆ వ్యవహాలను సెటిల్ చేసుకుని కట్టప్ప పనిపడతారో చూడాలి.