బీఆర్ఎస్ లో కొత్త జోష్ కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పార్టీలోకి వరుస చేరికల ప్రక్రియ కొనసాగుతుండగా మరోపక్క పార్టీ అధిష్టానం నాయకులకు పదవులు ఇవ్వడంతో గులాబీ రెపరెపలాడుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదవుల పంపకం, పార్టీలోకి చేరికలతో బీఆర్ఎస్ పార్టీ జోష్‌లో ఉండగా కాంగ్రెస్ పార్టీ నేతల్లో మౌనం, బీజేపీలో నేతల్లో అయోమయం నెలకొన్నది. ప్రధానంగా జహీరాబాద్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ దాదాపుగా ఖాళీ అవుతున్నది. ఆ పార్టీకి పీసీసీ నేత నరోత్తం, ఇతర పార్టీ నేతలు ఇటీవలే బీఆర్ఎస్ చేరిపోయారు. అలాగే మాజీ డీసీసీబీ చైర్మన్ జైపాల్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేరారు. ఆయన చేరికతో కూడా అక్కడి బీజేపీలో పెద్ద జోష్ కనిపించకపోవడం గమనార్హం.ఇదే సమయంలో గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ సీనియర్లు మౌనం వహించడం, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ నాయకుల్లో అయోమయం నెలకొనడం ఆసక్తిగా మారింది. ఇదే అదనుగా బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది.
ఉమ్మడి జిల్లాలో వరుస చేరికలు
అధికార బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధానంగా గజ్వేల్ సెగ్మెంట్ లో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో రోజువారీగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. అలాగే సంగారెడ్డిలో చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, నారాయణఖేడ్ లో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో ఇతర పార్టీ వారు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగుతున్నాయి.జహీరాబాద్ కాంగ్రెస్ నేత నరోత్తం, సామాజిక కార్యకర్త ఢిల్లీ వసంత్, ఇతర కాంగ్రెస్ నేతలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ చేరిన విషయం తెలిసిందే. అలాగే వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో రోజువారీగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరుతున్నారు.
గత వారం రోజులుగా గజ్వేల్ సీఎం క్యాంప్ ఆఫీస్ లో ప్రతాప్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా బుధవారం ఒక్కరోజే గజ్వేల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరడం గమనార్హం.అధికార బీఆర్ఎస్ పార్టీలో పదవుల పంపకంతో కొత్త జోష్ నెలకొన్నది. ఇటీవల అందోల్‌కి చెందిన ఉద్యమ యువ నాయకుడు మఠం భిక్షపతికి, జహీరాబాద్ కు చెందిన మాజీ మంత్రి కొడుకు మహ్మద్ తన్నీర్ లకు కార్పొరేషన్ పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పటాన్ చెరు చెందిన మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.
అలాగే ఇదే పటాన్ చెరు కు చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు కేబినెట్ నిర్ణయించింది. వరస పదవులతో బీఆర్ఎస్ పార్టీలో సంబరాలు నెలకొంటున్నాయి. మరిన్ని పదవులు కూడా ఉమ్మడి జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు.ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి, గీతారెడ్డి, సురేశ్షెట్కార్ ఇలాంటి వారంతా ఎక్కడికి వెళ్లారని, పార్టీని కాపాడే ప్రయత్నం ఎందుకు చేయడం లేదనే చర్చ కొనసాగుతోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగనున్నాయా..? ప్రతిపక్ష పార్టీలో ఎలాంటి ఎత్తుగడలు వేయనున్నాయి..? అధికార పార్టీ మరింత ఉత్సాహంతో దూసుకుపోనున్నదా..? అనేది వేచి చూడాల్సి ఉంది.