తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవే చివరికి సమావేశాలు అయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించబోతోంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా శాసనసభ సమావేశాలలో వివిధ అంశాలలో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టడం కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేకపోవడంతో అనేక బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన వ్యవహారంలో బిజెపిని కేంద్రంగా చేసుకొని తీవ్రస్థాయిలో విరుచుకు పడటం కోసం బీఆర్ఎస్ రెడీ అవుతోంది. అలాగే ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ తీరును కూడా కేసీఆర్ సభ ద్వారా ప్రజలకు వివరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై రాష్ట్ర హైకోర్టు వేటు వేయడం, జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా పరిగణించాలంటూ తీర్పు వెలువరించింది. దీంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ఈ ఇద్దరు నేతల్లో ఎవరు హాజరవుతారనే చర్చ జరుగుతోంది. తన ఎన్నిక చెల్లదంటూ వెలువరించిన తీర్పుపై స్టే కోసం వనమా తిరిగి హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో కోర్టు తీర్పును అమలు చేయక తప్పని పరిస్థితి.. మరోవైపు, కోర్టు తీర్పు ఆధారంగా తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శిని కలిశారు. కానీ ఎలాంటి నిర్ణయంమ తీసుకోలదేు. సమావేశాలకు హాజరవ్వాలంటే జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది.స్పీకర్ అలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొచ్చు. ఈ విషయంపై తన నిర్ణయాన్ని స్పీకర్ పెండింగ్ లో పెడితే మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇద్దరిలో ఎవరికీ ఉండదని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా నిర్వహించి, ప్రజలకు అన్ని విషయాలను తెలియజేయాల్సిన అవసరముందని స్పీకర్ పోచారం ప్రకటించారు. గతంలో లాగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని స్పీకర్ పోచారం కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు.
గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్‌లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలన్నారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ముద్రించి ముందస్తుగా సభ్యులకు అందిస్తే వారు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖ తరుపున ఒక నోడల్ అధికారిని నియమించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.