హైదరాబాద్ లో భూముల ధరలు చరిత్ర సృష్టించాయి. హెచ్‌ఎండీఏ కోకాపేట ఏరియాలో – నియోపోలిస్ ఫేజ్-2 భూముల వేలం నేడు ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో వివిధ కంపెనీలు భూములను భారీ రేటు చెల్లించి దక్కించుకున్నాయి. చరిత్రలో అత్యధికంగా ఎకరం రూ.100 కోట్ల ధర దాటింది. ఇంత భారీ స్థాయిలో ధర పలకడం సంచలనంగా మారింది. నియో పోలిస్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎకరం భూమి ధర రూ.35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను తొలుత నిర్ణయించింది.ఈ వేలంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీ పడగా, ఉదయం నుంచి వివిధ ప్లాట్లు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. సాయంత్రానికి ఈ వేలంలో అత్యధికంగా ఎకరం భూమి రేటు రూ.100.75 కోట్లతో పాడుకొని మరీ ఓ సంస్థ దక్కించుకుంది. అతి తక్కువ ధరే రూ.51.75 కోట్లు పలకడం విశేషం.
కోకాపేటలోని నియోపోలిస్ ఫేజ్ – 2 హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట భూముల వేలాన్ని నిర్వహించారు. 45.33 ఎకరాల్లోని ఏడు ప్లాట్లను హెచ్‌ఎండీ వేలం వేసింది. ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ ఈ వేలం కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వ ధర ఒక ఎకరానికి రూ.35 కోట్లుగా నిర్ణయించారు.ఇలా నియో పోలిస్ ఫేజ్ – 2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.1,532.50 కోట్ల మేర ఊహించని ఆదాయం ఖజానాకు చేరబోతోంది. గురువారం (ఆగస్టు 3) ఉదయమే 26.86 ఎకరాలకు వేలం పూర్తికాగా, దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీలు పడి మరీ కొనుక్కున్నాయి. మైహోం, షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ, రాజపుష్ప లాంటి పేరొందిన రియల్ ఎస్టేట్ సంస్థలు వేలంలో పాల్గొన్నాయి.సాయంత్రం నుంచి 10, 11, 14 నెంబరు ప్లాట్ల వేలం జరిగింది.
ఈ మూడు ప్లాట్ల విస్తీర్ణం 18.47 ఎకరాలు. వీటిలో 10వ నెంబరు ప్లాటు చారిత్రాత్మక ధర పలికి.. ఎకరం రూ.100.75 కోట్ల ధర పలికింది. 3.6 ఎకరాల్లో ఈ పదో నెంబరు ప్లాటు ఉంది. ఈ ఒక్క పదో నెంబరు ప్లాటు వల్లనే రూ.360 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.కోకాపేటలో అభివృద్ధి చేసిన లే అవుట్ కోసం హెచ్‌ఎండీఏ సుమారు రూ. 300 కోట్ల రూపాయలను వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది. సుమారు 41 ఎకరాలను రకరకాల వసతుల కోసమే కేటాయించారు. లేఅవుట్‌లోని రోడ్లన్నీ 45 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల రహదారి, 36 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు.ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధిచేసిన కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లో ప్లాట్లు కొంత కాలంగా వేలం వస్తున్నారు. 2021లో మొదటి ఆన్‌లైన్ వేలం నిర్వహించారు. మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను వేలం వేశారు.
అప్పట్లో ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు. ఇందులో ఎకరానికి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ఠ ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది. 2/పీ వెస్ట్ పార్ట్ గల ప్లాట్‌ను రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతం చేసుకుంది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు అప్పుడు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరింది