తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అకాల వర్షాల కారణంగా వచ్చిన వరదలు, ముంపు, ఇతర ప్రజా సమస్యలపై విపక్ష నేతలు.. ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా.. అధికార పక్షం సైతం అంతే దీటుగా సమాధానం ఇస్తోంది. సభ్యులు అడిగి ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అయితే, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మంత్రి కేటీఆర్ విపక్షాలకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూ ర్యాగింగ్ చేసినంత పని చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సందర్భం వచ్చిన ప్రతిసారి తన మాటలతో చురకలు అట్టింస్తున్నారు. సాధారణంగా అసెంబ్లీ జీరో అవర్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు నోట్ చేసుకున్నాం.. పరిశీలిస్తాం.. అని సమాధానం చెబుతారు. కానీ మంత్రి కేటీఆర్ మాత్రం విపక్షాలను అటాక్ చేస్తున్నారు.
కాంగ్రెస్ సభ్యుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ.. హోమ్ గార్డ్స్, జర్నలిస్ట్ లు, క్యాన్సర్ రోగుల గురించి ప్రశ్నించగా.. రైతులకు రుణమాఫీ చేశాం, సంగారెడ్డి వరకు మెట్రో తీసుకొచ్చాం.. కనీసం వాటికి ఒక్కరు కూడా కృతఙ్ఞతలు చెప్పడం లేదంటూ సెటైర్ వేసారు.ఇక శ్రీధర్ బాబు సీఎం గురించి టాపిక్ తీయగా.. ‘మీకు, మాకు, ఈ రాష్ట్రానికి సీఎం ఒకరే అంటుంటే.. మీ కాంగ్రెస్‌లో మాత్రమే పది మంది ముఖ్యమంత్రి అభ్యర్థులుంటారు’ అంటూ సెటైరేసారు. అటు భట్టి విక్రమార్క, సీతక్క ఇలా అందరికి కేటీఆర్ సమాధానం ఇవ్వడంతో పాటు సెటైర్లు వేస్తుండటంతో భట్టి విక్రమార్క ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్ సభ్యులు ఎవరు ఏం మాట్లాడినా మంత్రి కేటీఆర్ పంచులు వేయడంతో ఒకానొక సమయంలో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క తాము వాక్ అవుట్ చేస్తున్నామంటూ సభలో నిరసన వ్యక్తం చెశారు.
కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే అటూ బీజేపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ని కూడా మంత్రి కేటీఆర్ వదల్లేదు. పలు సమస్యలపై జీరో అవర్‌లో ఈటెల మాట్లాడగానే మంత్రి కేటీఆర్ లేచి.. ‘ఈటెల రాజేందర్ మా దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు హుజురాబాద్‌లో ఐటీ కంపెనీ ఉండేది. మరి ఇప్పడు అది ఉందా? లేదా? మీరు వెళ్లిపోయారు మా పార్టీ నుండి. ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయింది.’ అంటూ చురకలంటించారు. ఇక సభ పని దినాల టాపిక్ రాగానే ఒక పార్టీ 30 రోజులు అంటారు.. ఇంకో పార్టీ 20 రోజులు అంటారు.. కానీ ఒక్క పార్టీ నుండి ఒక్కోరు మాత్రమే సభలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
అయితే, ఈ కామెంట్‌కు వెంటనే రియాక్ట్ అయిన రాజా సింగ్.. నేను ఉన్నానంటూ సమాధానం చెప్పారు. దీనికి కూడా మంత్రి కేటీఆర్ స్పాంటేనియస్‌గా స్పందించారు. ‘మీరు సస్పెండ్ అయ్యారు. మీరు బీజేపీ కాదు. ఈ విషయం మీకు తెలియదా?’ అనగానే రాజాసింగ్ షాక్ అయ్యారు. సో అలా కేటీఆర్ ఛాన్స్ దొరికినప్పుడల్లా సభలో విపక్ష సభ్యుల్ని పదే పదే ర్యాగింగ్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.