పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బదులిచ్చిన తీరు పట్ల విపక్షాలు పెదవివిరిచాయి. ప్రధాని ప్రసంగంలో పస లేదని మణిపూర్ హింసాకాండపై ఆయన ప్రసంగంలో 90 నిమిషాల పాటు ఎలాంటి ప్రస్తావన లేదని ఆక్షేపించింది. సభ నుంచి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేసిన అనంతరం ఈ అంశాన్ని ప్రస్తావించారని మండిపడింది.ప్రధాని మోదీ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తుండగా విపక్ష ఇండియా కూటమి ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రధాని తన ప్రసంగం ప్రారంభించిన 90 నిమిషాల వరకూ ఉద్దేశపూర్వకంగానే మణిపూర్ ప్రస్తావన తీసుకురాలేదని విపక్ష ఎంపీలు వాకౌట్ చేసిన తర్వాత తన వైఖరి మార్చుకుని ఈశాన్య రాష్ట్రంలో అల్లర్ల గురించి ప్రస్తావించారని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రైన్ మండిపడ్డారు. మోదీ ప్రసంగంలో టెఫ్లాన్ కోటింగ్ అదృశ్యమైందని, మునుపటి జోష్, మెరుపు మాయమయ్యాయని అన్నారు.
మోదీజీ ఇవాల్టి మీ ప్రసంగంతో విపక్ష కూటమి ఇండియా విజయం తధ్యమనే విశ్వాసం పెరిగిందని జీతేగా భారత్ అంటూ వీడియో మెసేజ్‌లో ఒబ్రైన్ పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోదీ రాజ్యసభ ముఖం చూడలేదని అన్నారు. లోక్‌సభలో మణిపూర్ గురించి కేవలం 4 నిమిషాలే మాట్లాడారని, స్వాతంత్ర్యం అనంతరం మోదీ కంటే ఏ ఒక్క ప్రధాని పార్లమెంట్‌ను ఇంతలా అవమానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రధాని మోదీ తన ప్రసంగంలో విపక్షాలపై ప్రధానంగా కాంగ్రెస్‌పై విమర్శల దాడితో విరుచుకుపడ్డారు. పేదల ఆకలి గురించి కాంగ్రెస్‌కు పట్టదని, అధికార దాహంతో ఆ పార్టీ తహతహలాడుతుందని ఆరోపించారు. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని అన్నారు.