గత కొద్ది వారాలుగా దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ స్కామ్‌లు పెరిగాయి. ఆన్‌లైన్ వేదికగా స్కామర్లు రోజుకో తరహా స్కామ్‌తో అమాయకుల నుంచి అడ్డంగా దండుకుంటున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రాం, వాట్సాప్ స్కామ్‌లతో చెలరేగిన సైబర్ నేరగాళ్లు బాధితులే లక్ష్యంగా లేటెస్ట్‌గా డేటింగ్, మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లను ఉపయోగించుకుంటున్నారు.లింక్‌లు క్లిక్ చేయడం, ఆన్‌లైన్ టాస్క్‌లు పూర్తి చేయడం వంటి ట్రిక్స్‌ను దాటిన స్కామర్లు తాజాగా డేటింగ్, మ్యాట్రిమోనియల్ సైట్స్‌ను ఎంచుకుని భాగస్వాములను నిలువునా ముంచేస్తున్నారు. ఖరీదైన గిఫ్ట్‌లు పంపామని, వాటిని ఎయిర్‌పోర్ట్‌లో విడిపించుకునేందుకు కస్టమ్స్ అధికారులకు పెద్దమొత్తంలో చెల్లించాలని చెబుతూ బాధితులను ముంచేస్తున్నారు. ఆపై దర్యాప్తు అధికారులమని చెబుతూ స్కామర్లు అమాయకులను బెదిరించి రూ. లక్షల్లో దండుకుంటున్నారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆయా యాప్ యూజర్లను హెచ్చరించింది.
యువత ఈ తరహా మోసాలకు బలవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఆన్‌లైన డేటింగ్\రొమాన్స్ స్కామ్‌ల్లో బాధితులు సగటున రూ. 7996 కోల్పోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మ్యాట్రిమోనియల్, డేటింగ్ స్కామ్స్ గురించి అవగాహన కల్పిస్తూ ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యక్తిగత ఖాతాలకు సంబంధించి భారత కస్టమ్స్ అధికారులు ఎవరూ ఎస్ఎంఎస్‌లు పంపడం, కాల్స్ చేయడం వంటివి చేయరని పేర్కొంది. ఆన్‌లైన్ లవర్స్ అందించే ఖరీదైన గిఫ్ట్‌ల వలలో పడవద్దని హెచ్చరించింది.