రిషికొండ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కుదిపేస్తున్న హాట్ టాపిక్. అంతా ఈ కొండ చుట్టే తిరుగుతోంది. ఒకరు ఇక్కడే అంటే.. మరొకరు అదిగో అలా అంటారా.. ఇదేంటి మీరు చెప్పిందేంటి. అంటూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇది ఈ మధ్య కొత్తగా మొదలైన పొలిటికల్ హీట్ కాదు.. గత రెండు, మూడేళ్లుగా ఇక్కడ జరుగుతున్న రాజకీయ రచ్చ. విశాఖపట్నంలో రిషికొండలో ప్రభుత్వ నిర్మాణాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో రగిలిస్తున్న వేడి అంతా ఇంతాకాదు. మొత్తం ఈ అంశం చుట్టూనే ఉత్తరాంధ్ర సహా, విశాఖ రాజకీయాలు నడుస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుసగా రెండోసారి రిషికొండను విజిట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోపాటు, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపైనే అటు వైసీపీ నుంచికూడా కౌంటర్లు గట్టిగానే పడ్డాయి.
ఇది పక్కనపెడితే అసలు రిషికొండ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం ఏ చెప్తుందో ఓ సారి చూద్దాం..రుషి కొండమీద గతంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ కొన్ని నిర్మాణాలు చేపట్టింది. పర్యాటకులకు ఇక్కడ గదులను రెంట్‌కు ఇచ్చేవారు. వీటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ కొన్ని అనుమతులు తీసుకుంది.కేంద్ర అటవీశాఖ నుంచి మార్చి 12, 2021న, అలాగే మే 19, 2021న సీఆర్‌జెడ్ పర్మిషన్‌ను తీసుకుంది. దీని తర్వాతనే స్థానిక ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి మిగిలిన అనుమతులు తీసుకుంది. ఫైర్ సేఫ్టీ పర్మిషన్, జీవీఎంసీ నుంచి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా పర్యాటక శాఖ పర్మిషన్లు తీసుకుంది. వీటన్నింటి తర్వాత 2021 సెప్టెంబరులో చట్టబద్ధంగా భవనాల నిర్మాణం ప్రారంభం అయినట్టుగా ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.రిషికొండలో నిర్మాణాలు జరుగుతున్న భూమి ప్రభుత్వ భూమి.. పర్యాటక శాఖకు సంబంధించిన భూమి. ఇక్కడ పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది.
ఇందులో 9.88 ఎకరాల్లో నిర్మాణాలకోసం ప్రభుత్వానికి అనుమతులు వచ్చాయి. ఇందులో కూడా కడుతున్నది కేవలం 2.7 ఎకరాల లోపలే నిర్మాణాలు చేస్తున్నామని, 7 భవనాలకు పర్మిషన్లు వస్తే, కేవలం 4 భవనాలు మాత్రమే నిర్మిస్తున్నామని, అదికూడా జీ ప్లస్ ఒన్ ఎత్తులోనే అని ఆ అధికారి చెప్పారు.అయితే రిషి కొండలో కడుతున్న నిర్మాణాలన్నీ వేరే అవసరాలకు ఉద్దేశించినవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్కడ సీఎం జగన్ నివాసం కోసమే కడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కడుతున్నవి ప్రభుత్వ భవనాలే అని.. రాష్ట్ర ప్రభుత్వం తన అవసారలకు వాడుకుంటే.. ప్రతిపక్షాలకు వచ్చిన ఇబ్బంది ఏంటని అధికారపార్టీ వైసీపీ అంటోంది.