tdp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

టీడీపీని కంగారు పడుతున్న వ్యూహం

వ్యూహం.. ఆర్జీవీ.. ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఎక్కువగా నలుగుతున్న పేర్లు ఇవి. ఇంకా చెప్పాలంటే.. కాస్తో.. కూస్తో.. కంగారు పెడుతున్న పేర్లు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తీస్తున్న సినిమా వ్యూహం. ఇది సీఎం జగన్‌కు, వైపీపీకి అనుకూలంగా ఉంటుందన్న విషయంలో ఎలాంటి వివాదం లేదు. కానీ… పాత్రల చిత్రీకరణపైనే అనుమానాలు, ఆసక్తులు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టే… వర్మ టీజర్లతో టెంపరేచర్‌ పెంచుతున్నారు. వరుస టీజర్లు విడుదల చేస్తూ…సినిమాకు హైప్‌ తీసుకొస్తున్నారు. అదే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్స్‌తో ఆర్జీవీ వర్సెస్‌ టీడీపీ అన్నట్టుగా మారింది వ్యవహారం. ఎవరెవరి కేరక్టర్‌ని ఎలా చూపిస్తారు? వివేకానందరెడ్డి హత్య ప్రస్తావన కూడా ఉంటుందా? ఉంటే… అందుకు బాధ్యులుగా ఎవర్ని చూపుతారు లాంటి సవాలక్ష ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

వైసీపీ చెబుతున్నట్టు వివేకాను సెకండ్‌ ఫ్యామిలీ గొడవల కారణంగా చంపేశారని చూపుతారా..? లేక ఇంకా ఇంకేదైనా ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌ ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారం టీడీపీని భయపెడుతోందా..? టీజర్స్‌ చూసి ఖచ్చితంగా ఇది తమను డ్యామేజ్‌ చేస్తుందని డిసైడై రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టారా అన్న మరో చర్చ కూడా ఉంది.వ్యూహం తమను భయపెడుతోందనే దానికంటే.. ఆ సినిమా పేరుతో జరిగే రచ్చ ఎక్కువగా చికాకు పెడుతోందన్నది టీడీపీ వర్గాల వాదన. కథ, కథనంలో కొత్తేమీ లేదని, ఏ పాత్రను ఎలా చిత్రీకరిస్తారన్నది తాము ఊహించగలమంటున్నారు పార్టీ నాయకులు. సినిమా చిత్రీకరణ మొదలవడానికి ముందు… సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆర్జీవీ కలిసినప్పుడే క్లారిటీ వచ్చేసిందని, అందుకే ఆ భయం లేనప్పటికీ… సోషల్‌ మీడియాలో లేనిపోని చర్చలు పెట్టి రచ్చ చేస్తూ… ఇరిటేషన్‌ పెంచుతున్నారన్నది తెలుగుదేశం వర్గాల అభిప్రాయం అట.

ఇప్పటికే సోషల్‌ మీడియాలో రకరకాల ఎలిమెంట్స్‌ తమను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయని..రామ్‌గోపాల్‌ వర్మ కూడా ఆ కోవలోకే వస్తారని అంటున్నారు టీడీపీ నేతలు. అయితే… సీనియర్‌ డైరెక్ట్‌ర్‌ కాబట్టి ఎంతో కొంత న్యూస్‌ వాల్యూ ఉంటుందని, అందుకే అవతలి వాళ్ళు కాలు దువ్విన, కన్నుగీటిన ప్రతిసారి కాకున్నా… అప్పుడప్పుడైనా స్పందించక తప్పడం లేదంటున్నారు. సినిమా రచ్చపై బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్‌ చేసినా… దేవినేని ఉమా ధర్నా చేసినా అందులో భాగమేనన్నది ఎన్టీఆర్‌ భవన్‌ వర్గాల మాటగా చెబుతున్నారు.తమ పార్టీ మీద సినిమాలు తీయడం కొత్త కాదని, ఇప్పుడు చంద్రబాబు టార్గెట్‌గా సినిమాలు తీస్తున్నట్టే.. గతంలో ఎన్టీఆర్‌ లాంటి మహా నాయకుడిని లక్ష్యంగా చేసుకుని చాలా సినిమాలు తీశారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇలాంటి పొలిటికల్‌ సెటైరికల్‌ సినిమాలతో పెద్దగా వచ్చేది, పోయేదేం ఉండదన్నది ప్రతిపక్ష పార్టీ లెక్క. వ్యూహం సినిమా గురించి మాట్లాడటమంటే….బురదలో రాయి వేసే సామెతేనని తాము అనుకుంటున్నా… తమ అధినేతను పూర్తిగా విలన్‌గా చిత్రీకరిస్తున్న సందర్భంలో అప్పుడప్పుడన్నా స్పందించక తప్పడం లేదంటున్నారు.

మరోవైపు కౌంటర్‌గా తాము కూడా సినిమా తీయాలన్న ప్రతిపాదన వచ్చినా… పార్టీ పెద్దల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదట. తాము చెప్పిన యాంగిల్‌లో, అవే పాత్రలతో సినిమా తీసేవాళ్ళు రెడీగా ఉన్నా…. అనవసరంగా రాజకీయాల్లోకి సినీ పరిశ్రమను లాగడం ఎందుకనే భావనతో ఆగిపోయారట. ఇలా రకరకాలుగా పైకి ఎంత సర్ది చెప్పుకుంటున్నా….ఆర్జీవీ తీసే వ్యూహం సినిమా ఎలా ఉండబోతోంది..? ప్రేక్షకులు దాన్ని పాజిటివ్‌గా రిసీవ్‌ చేసుకుంటారా..? లేదంటే… దాన్నో వన్‌సైడ్‌ మూవీగా చూసి వదిలేస్తారా? అన్న భయాలు, అనుమానాలు మాత్రం టీడీపీ వర్గాల్లో గట్టిగానే ఉ్ననాయట. ఆ సినిమా జనంలో మైండ్‌లోకి ఎక్కకూడదని దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదని కొందరు టీడీపీ నేతలే మాట్లాడటం కొసమెరుపు.