- ప్రచురించిన భాషాసాంస్కృతికశాఖ
- నమస్తే తెలంగాణ కథనాలతో ఒక పుస్తకం
- 28న శతజయంతి ఉత్సవాల్లో ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై
బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి అందించిన విశిష్ట సేవలను స్మరిస్తూ, ఆయన ఖ్యాతి చిరస్థాయిగా నిలిచేలా తెలంగాణ ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలను ఏడాదిగా ఘనంగా నిర్వహిస్తున్నది. ఎంపీ కే కేశవరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన శతజయంతి ఉత్సవాల కమిటీకి అనుబంధంగా నియమించిన ఉప కమిటీ పర్యవేక్షణలో దాదాపు ఏడాది కృషితో 9 పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ సాంస్కృతికశాఖ వాటి ప్రచురణను పూర్తిచేసింది. సోమవారం పీవీ జ్ఞానభూమిలో నిర్వహించనున్న శత జయంతి ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్ ఈ పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఇందులో పీవీ రాసినవి 4 పుస్తకాలు ఉండగా, మిగిలినవి ఆయన చేసిన కృషి, ఆయన జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు ఉన్నాయి. పీవీ జ్ఞానభూమిలో సోమవారం ఉదయం 11:30 గంటలకు భజన సంకీర్తనలు, మధ్యాహ్నం 12గంటలకు పుష్పాంజలి, పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కే కేశవరావు స్వాగతోపన్యాసం, 12:25-పుస్తకావిష్కరణ, 12:30-ముఖ్యమంత్రి సందేశం, 12:50-గవర్నర్ ప్రసంగం, 1గంటకు-వందన సమర్పణ ఉంటుందని నిర్వాహకులు శనివారం పేర్కొన్నారు. పీపీ సాహిత్యానికి, ఆయన వ్యక్తిత్వానికి, ఆలోచనా విధానానికి పుస్తక రూపం ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉప కమిటీలో సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ సలహాదారు, సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్, అధికార భాషాసంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, పీవీ తనయుడు ప్రభాకర్‌రావు, కుమార్తె ఎమ్మెల్సీ సురభివాణీదేవి, అంబేద్కర్ ఓపెన్‌వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, భాషాసాంస్కృతికశాఖ సంచాలకుడు, పీవీ శత జయంతి వేడుకల ప్రత్యేక అధికారి మామిడి హరికృష్ణ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
పుస్తకాల వివరాలు..
- పశ్చిమ దేశాలపై భారత సంస్కృతి ప్రభావంపై పీవీ ప్రసంగాల సంకలనం.
- పీవీ రాసిన 8 అరుదైన కథల సంకలనం. ఇందులో ప్రసిద్ధ గొల్ల రామవ్వ కథ కూడా ఉన్నది.
- పీవీ వివిధ సందర్భాల్లో రాసిన వ్యాసాల సంకలనం.
- పీవీని మీడియా ప్రతినిధులు వేర్వేరుగా చేసిన ఇంటర్వ్యూల సంకలనం.
- పీవీ ఆర్థిక సంస్కరణలు, ఆయన పాలనారీతులపై దేశవిదేశాల అగ్రనాయకులు రాసిన వ్యాసాల సంకలనం. దీనికి ప్రముఖ జర్నలిస్టు సంజయ్ బారు సంపాదకుడిగా వ్యవహరించారు.
- పీవీ స్ఫూర్తిగా దాదాపు 125కు పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర కార్టూనిస్టులు వేసి క్యారికేచర్‌ల సంకలనం.
- చాణక్య (పీవీ జీవిత చరిత్రపై వెలిజాల చంద్రశేఖర్ రాసిన పుస్తకం).
- నమస్తే పీవీ (పీవీ గురించి నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రచురించిన వ్యాసాల సంకలనం).
- కాలాతీతుడు (పీపీ జీవిత స్ఫూర్తితో 143 మంది కవుల కవితా సంకలనం).