అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలో మీడియా ఇంటర్వ్యూలు, చర్చా వేదికలపై వివిధ అంశాల గురించి తన ఆలోచనలను పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పై మాట్లాడారు.ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఆపాలంటే ముందు చైనా తో పుతిన్ దోస్తీని కట్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా- చైనా సైనిక కూటమితో అమెరికాకు ఎప్పటికైనా ముప్పు పొంచి ఉందన్నారు. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే ఒకటే మార్గం. ముందు చైనాతో పుతిన్ దోస్తీని కట్ చేయడమే. ఆ పని నేను చేయగలను. నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మాస్కోలో పర్యటిస్తా. చైనాతో దోస్తీని వదులుకునేలా పుతిన్‌కు ఒప్పిస్తా. నా విదేశీ విధానాల్లో ఇదే ప్రథమమైనది.
అయితే, ఈ మొత్తం ప్రాసెస్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఓడించే లక్ష్యంతో కాకుండా అమెరికాను గెలిపించే లక్ష్యంతో ముందుకెళ్తా. రష్యాను ఆపేందుకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ అనుసరిస్తున్న విధానం సరిగా లేదు. ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా ఎంత సాయం చేసినా నిరుపయోగమే. దీనివల్ల పుతిన్ చైనాకు మరింత దగ్గరవుతాడు’ అని వివేక్ రామస్వామి తెలిపారు.