ఉమ్మడి విశాఖ జిల్లాలో జనవాణితో పాటు రెండు బహిరంగ సభలు, నాలుగు ఫీల్డ్ విజిట్లు నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఈ టూర్ మొత్తం మీద ప్రత్యర్థులకు పొలిటికల్ ధమ్కీలు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నారాయన. పవన్ కౌంటర్స్‌కు అధికార పార్టీ కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతుండటంతో… ప్రస్తుతం జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టు మారిపోయింది యవ్వారం. అదే ఊపుతో ఉత్తరాంధ్రలో తమ తొలిసీటును చెప్పకనే చెప్పేసింది జనసేన. అది కూడా గాజువాక కావడమే అసలు ట్విస్ట్. గతంలో తాను పోటీ చేసి ఓడిపోయిన సీట్లో ఈసారి జెండా పాతేయడం ఖాయమని వారాహి విజయోత్సవ వేదికపై నుంచే ప్రకటించేశారు పవన్. ఈ ప్రకటన తర్వాత మరోసారి గాజువాక నుంచి జనసేనాని పోటీ చేస్తారన్న ప్రచారం బయలుదేరింది. అభ్యర్థి ఎవరన్న సంగతి పక్కనపెడితే… టీడీపీతో పొత్తు దాదాపు ఖాయమనుకుంటున్న టైంలో…ఈసారి గాజువాక మాదేనని జనసేన ముందే ఖర్చీఫ్ వేసిందన్న మాట మాత్రం వాస్తవం.
ఇక్కడే రచ్చబండ పంచాయితీ మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు.పవన్ స్టేట్‌మెంట్ పొలిటికల్‌గా జనసైనికులకు కొత్త ఉత్సాహం తెస్తే… టీడీపీ కేడర్‌లో కలవరపాటు పెరుగుతోందట. రెండు పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణమే ఉన్నా… పొత్తుపై సందిగ్ధత వీడక ముందే జనసేన పోటీ విషయంలో ప్రకట చేయడం, పాత లెక్కలు సరిచేస్తామనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది లోకల్ టీడీపీ నేతల క్వశ్చన్. పాత లెక్కలు అన్న పదానికి అందరికంటే ఎక్కువగా టీడీపీ గాజువాక ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాస్ కలవరపడుతున్నట్టు తెలిసింది. 2019ఎన్నికల్లో ఏపీలో హైవోల్టే జ్ రాజకీయాలు నడిచిన స్థానం గాజువాక. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఓవైపు….పొలిటికల్ సీనియారిటీని, జగన్ వేవ్‌ను నమ్ముకున్న తిప్పల నాగిరెడ్డి మరోవైపు, వరుస విక్టరీ కోసం ప్రయత్నించిన నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఇంకోవైపు తలపడ్డారు. ఈ ట్రయాంగిల్ ఫైట్‌లో పవన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు.
గాజువాకలో మూడు లక్షలకు పైగా ఓటర్లు ఉండగా…నాగిరెడ్డికి 75,292 ఓట్లు రాగా 38% శాతంగా ఉంది. పవన్ కల్యాణ్ ఓట్ షేర్ 58వేల 539తో 29%గా ఉంది.టీడీపీ అభ్యర్ధి పల్లాశ్రీనివాస్ మూడో స్ధానానికి పరిమితం అయ్యారు. కానీ.. ఇక్కడ పవన్, పల్లా మధ్య ఓట్ల తేడా కేవలం రెండు వేలే. అంటే… ఒక్క శాతం వ్యత్యాసం మాత్రమే కనిపించింది. ఈ లెక్కల సంగతి కాసేపు అలా ఉంచితే.. నాడు పవన్ కళ్యాణ్ ఓటమికి నాగిరెడ్డి కంటే పల్లాశ్రీనివాస్ చేసిన నెగెటివ్ పబ్లిసిటీనే ప్రధాన కారణం అన్నది జనసేన వర్గాల బలమైన అభిప్రాయం. ఆ ఫీడ్ బ్యాక్ పవన్ మనసులో బలంగా నాటుకుపోయిందని అంటున్నారు. పోటీలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి.. ఆ ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం గాజువాకను సీరియస్‌గా తీసుకోలేదట. అభ్యర్థిని నిలబెట్టాలి కాబట్టి.. అయిష్టంగానే పల్లాను ప్రకటించిందన్న టాక్ ఉంది. అది నిజమేనా అన్నట్టుగా.. చంద్రబాబు, బాలకృష్ణ లాంటి స్టార్ కేంపెయినర్స్ విశాఖ వచ్చినా… గాజువాకను టచ్ చేయలేదు. దీంతో స్థానిక టీడీపీ అభ్యర్థి.. వైసీపీతో కుమ్మక్కు అయ్యారని తర్వాత పోస్ట్‌మార్టంలో తేలిందట. పల్లాశ్రీనివాస్ టీడీపీ అభ్యర్థి అయిఉండి కూడా… ఓటు వేస్తే నాకు వేయండి లేకుంటే…వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డికి వేయండి తప్ప.. నాన్ లోకల్ అయిన పవన్‌కు మద్దతు ఇవ్వవద్దని గట్టిగానే ప్రచారం చేశారట.దాని ప్రభావం తమ నాయకుడి విజయంపై పడిందని నమ్ముతున్నారు గాజువాక జనసేన నాయకులు.
అదే సమయంలో పల్లా శ్రీనివాస్ వైఖరిపై స్థానిక టీడీపీ కేడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉందట. ఈ పరిస్థితుల్లోనే…మరోసారి గాజువాక మాదేనంటూ ట్విస్ట్ ఇచ్చారు పవన్. అంటే… టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే… గాజువాక కోసం గట్టిగా పట్టుబట్టి ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటున్నట్టు విశ్లేషిస్తున్నారు. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవడం ఒకటైతే… తనను తీవ్రంగా డ్యామేజ్ చేసిన పల్లా మీద రివెంజ్ మరోటి అయి ఉంటుందని అంటున్నారు. మరి టీడీపీ తనకు బలమైన సీటు గా లెక్కలు వేసుకుంటున్న గాజువాక విషయంలో రాజీపడుతుందా…? ఒకవేళ అధినాయకత్వం ఓకే అన్నా…పల్లా వర్గం సహకరిస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.