సెప్టెంబరు 18వ తేది నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం విడుదల చేశారు.
సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు తిరుమ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఇవాళ ఆలయం ఎదుట శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లును విడుదల చేశారు. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.
సెప్టెంబరు 18 నుంచి 26వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. అక్టోబర్ 14 నుంచి 22వ తేది వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబరు 18వ తేదిన శ్రీవారికి సీయం జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేస్తాం. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాన్ని అమలు చేస్తాం. భక్తులకు వసతులు భద్రతపై అన్ని రకాల చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా
సెప్టెంబర్ 18న -ధ్వజారోహణం
సెప్టెంబర్ 22న -గరుడ వాహనం
సెప్టెంబర్ 23న- స్వర్ణరథం
సెప్టెంబర్ 25న – రథోత్సవం(మహారథం)
సెప్టెంబర్ 26న- చక్రస్నానం, ధ్వజావరోహణం
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా
అక్టోబరు 19న- గరుడవాహనం
అక్టోబరు 22న- స్వర్ణరథం
అక్టోబరు 23న- చక్రస్నానం
ఆర్జిత సేవలు రద్దు
బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు, అక్టోబర్ 15 నుంచి 23వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే అనుమతిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబరు 14న సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.