naralokesh
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

200వ రోజుకు చేరిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర

టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరింది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుండి 200 వ రోజు పాదయాత్ర ప్రారంభించారు.

నారాలోకేష్ యువగలం పాదయాత్ర 200వ రోజుకు చేరింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుండి 200 వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. తల్లి భువనేశ్వరి కూడా నారా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్నారు.

పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా భువనేశ్వరి, నందమూరి, నారా కుటుంబ సభ్యులు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. నేడు 2700 కిలోమీటర్ల మైలు రాయిని నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకుంటుంది.

200 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కొయ్యలగూడెం లో గిరిజనులతో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గిరిజనుల సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇవ్వనున్నారు. 200 రోజుల పాదయాత్ర సందర్భంగా లోకేష్ కి శుభాకాంక్షలు తెలపడానికి పెద్ద ఎత్తున చేరుకున్న నాయకులు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల ప్రజలు జంగారెడ్డి గూడెం చేరుకున్నారు.

200వరోజు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు యువగళం బృందాలు ఏర్పాట్లు చేశాయి. యువగళం పాదయాత్ర బుధవారం చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తించింది. అడుగడుగునా జనం నీరాజనాలు పాడుతూ సమస్యలను ఏకరవుపెట్టారు. జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్ లో జరిగిన బహిరంగసభలో యువనేత లోకేష్ జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త పాలనపై ఘాటు విమర్శలు చేశారు.

విశాఖలో బస్ షెల్టర్ కట్టడం చేతకానోడు 3రాజధానులు, పోలవరం కడతాడా అంటూ ఎద్దేవా చేశారు. బొర్రంపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర రావికంపాడు క్రాస్ వద్ద చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. అనంతరం రావికంపాడు, దేవలపల్లి, పుట్లగట్లగూడెం, గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం ఆటోనగర్, బస్టాండు, బైపాస్ మీదుగా దండమూడి కళ్యాణ మండపం వద్దకు చేరుకుంది. 199వరోజు యువనేత లోకేష్ 20.8 కి.మీ.ల పాదయాత్ర చేశారు.

ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2690 కి.మీ.లు పూర్తయింది. గురువారం పాదయాత్ర 200వ రోజుకు చేరుకోవడంతోపాటు 2700 కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా సీతంపేటలో యువనేత లోకేష్ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు.

యువగళం పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. చింతలపూడి నియోజకవర్గానికి ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ యాదవ్, ఆయన సోదరుడు మంగపతి యాదవ్ బుధవారం జంగారెడ్డిగూడెంలో యువనేత లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి యువనేత లోకేష్ పసుపుకండా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

3 రాజధానులు కడతానన్న జగన్ ఇప్పటి వరకూ 3 ఇటుకలు పెట్టలేదు కానీ విశాఖపట్నం ఒక బస్ షెల్టర్ కట్టాడని సాయంత్రం పూట చిన్న గాలికే అది కాస్తా కూలిపోయిందని టిడిపి యువనేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ…అది పునాదులు లేని ధర్మాకోల్ బస్ షెల్టర్ అని దాని ఖర్చు అక్షరాలా రూ.40 లక్షలు అని ఆరోపించారు. జగన్ బొమ్మ ఊడి కింద పడిందని అది సైకో జగన్ కెపాసిటీ అన్నారు.

బస్ షెల్టర్ కట్టడం రాని వాడు 3 రాజధానులు, పోలవరం కడతా అంటూ బిల్డప్ ఇస్తాడు. చంద్రబాబుది పోలవరం రేంజ్.. జగన్ ది మురికి కాలువ రేంజ్. జగన్ ది దరిద్ర పాదం. విశాఖ లో అడుగు పెడతా అన్న ప్రతి సారి ఎదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందన్నారు.