power cuts
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై క్లారిటీ.. అసలు కారణం ఇదే..!

రాష్ట్రంలో పవర్ కట్స్‌పై డిస్కంలు క్లారిటీ ఇచ్చాయి. గృహ, వ్యవసాయ రంగాలకు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నట్లు తెలిపాయి. డిమాండు మరింత పెరిగితే  పారిశ్రామిక రంగానికి స్వల్ప తగ్గింపు ఉంటుందని వెల్లడించాయి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి.

ఆంధ్రప్రదేశ్‌లో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో డిస్కంలు వివరణ ఇచ్చాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్ల విద్యుత్‌ డిమాండు విపరీతంగా పెరిగినా.. రాష్ట్రంలో, గృహ, వ్యవసాయ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు విద్యుత్‌ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. డిమాండు–సరఫరా మధ్య స్వల్ప అంతరం ఏర్పడిన సమయాల్లో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్‌ సరఫరా తగ్గించి గృహ, వ్యవసాయ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపాయి. 

“ఆదివారం ∙రాష్ట్రంలో  మొత్తం 206.5 మిలియన్‌ యూనిట్ల సరఫరా జరిగింది. నిన్న  విద్యుత్‌ సరఫరాలో  ఏ విధమైన  అంతరాయాలు కానీ లోడ్‌ షెడ్డింగ్‌ కానీ లేదు. సెప్టెంబర్‌ 1వ తేదీ నాడు అప్పుడు రాష్ట్రంలో  నెలకొన్న  గ్రిడ్‌ డిమాండు–సరఫరా  పరిస్థితులను బట్టి రాష్ట్రంలో  పారిశ్రామిక రంగానికి  కొద్దిమేర  విద్యుత్‌ సరఫరా తగ్గించి.. గృహ, వ్యవసాయ రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా  పరిగణించి  అంతరాయాలు లేని  విద్యుత్‌ సరఫరా చేయాలని  విద్యుత్‌ సంస్థలు  భావించాయి. దానికి అనుగుణంగా  కమిషన్‌కు అభ్యర్ధన పంపాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థల అభ్యర్ధన  మేరకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి వారు సెప్టెంబర్ 5వ తేదీ‌ నుంచి  రాష్ట్రంలో  పారిశ్రామిక రంగానికి  స్వల్పంగా  విద్యుత్‌ వాడకంలో  పరిమితులు విధించవచ్చని  ఆదేశాలు ఇచ్చారు.

మారిన వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుతం  నెలకొన్న  అల్పపీడన  పరిస్థితులతో  పడుతున్న వర్షాల  దృష్ట్యా   గ్రిడ్‌ డిమాండ్‌ కొంత మేర తగ్గింది. గత రెండు రోజులుగా  ఎటువంటి విద్యుత్‌  కొరత లేదు. విద్యుత్‌ సౌధలో ఈరోజు సీఎండీ/ ట్రాన్స్‌కో  రాబోయే రెండు వారాలపాటు విద్యుత్‌ సరఫరా పరిస్థితిని  అధికారులతో  కూలంకషంగా సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు  పారిశ్రామిక రంగానికి  విద్యుత్‌ వాడక పరిమితి  నిబంధనల అమలును  రద్దు చేసుకున్నాయి. దయచేసి వినియోగదారులందరు  ఈ విషయాన్ని  గ్రహించగలరని  రాష్ట్రంలో  ఏ విధమైన లోడ్‌ షెడ్డింగ్‌ కానీ, విద్యుత్‌ వాడకంలో పరిమితులు కానీ  లేవని తెలియజేస్తున్నాం. మెరుగుపడిన సరఫరా పరిస్థితి వల్ల  కమిషన్‌ ఇచ్చిన  పారిశ్రామిక  విద్యుత్‌  వాడకంలో  పరిమితి–నియంత్రణ  ఉత్తర్వులను  అమలు చేయడం లేదు. ఈ విషయం కమిషన్‌కు నివేదించడానికి  పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు స్వల్పకాలిక  మార్కెట్టు నుంచి  రోజుకి దాదాపు 40 మిలియన్‌ యూనిట్లు ప్రతీ  యూనిట్‌కు రూ.9.10 వెచ్చించి వినియోగదారుల  సౌకర్యార్ధంకొనడం జరుగుతోంది.   సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా  నిరంతరాయం అధికారులందరూ అప్రమత్తంగా  ఉన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా  గృహ, వ్యవసాయ, వాణిజ్య–పారిశ్రామిక  రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి శాయశక్తులా  కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం..” అని రాష్ట్ర ఇంధన శాఖ ప్రజా సంబంధాల విభాగం ప్రకటన విడుదల చేసింది.