rain
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో 4 రోజులు ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కన్పిస్తోంది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.

పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో రానున్న 4 రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగస్టు నెలంతా వర్షాభావ పరిస్థితులతో గడిచిపోగా సెప్టెంబర్ నెల మాత్రం ప్రారంభం నుంచి వర్షాలతో మొదలైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కాస్తా అల్ప పీడనంగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా ఇప్పుడు ఏపీకు కూడా భారీ వర్షాలు హెచ్చరిక జారీ అయింది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతంపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం మరో కారణమని వాతావరణ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం ఏపీలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. నిన్న అంటే సోమవారం నాడు ఏపీ విజయనగరం జిల్లా పినపెంకిలో అత్యధికంగా 9.109 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో 7.5 సెంటీమీటర్లు, కాకినాడ జిల్లా కందరాడలో 7.10 సెంటీమీటర్లు, అనకాపల్లి జిల్లా చోడవరంలో 6 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా రాచెర్లలో 5.20 సెంటీమీటర్లు, నంద్యాల జిల్లా కొండమనాయుని పల్లెలో 5.10 సెంటీమీటర్లు,  పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 5 సెంటీమీటర్లు, సత్యసాయి జిల్లా ధర్మవరంలో అత్యదికంగా 8.24 సెంటీమీటర్లు, అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో 5.94 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.

బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం  తెలంగాణ వరకూ ఉత్తర కోస్తాంధ్ర మీదుగా పయనిస్తోందని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో రానున్న 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంబడి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.