jd
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

విశాఖ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా జేడీ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.   నందిగామలో ఓ ప్రైవేటు స్కూల్ కార్యక్రమంలో పాల్గన్న ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రజాస్వామ్యంలో పార్టీలు, కులాల కంటే పోటీ చేసే అభ్యర్థులను చూసే ప్రతి ఒక్కరు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు వినియోగించుకోకపోతే వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతానన్నారు. గత ఎన్నికల్లో  జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే సానుకూల ఫలితం రాలేదు. తర్వాత విశాఖ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్నారన్న కారణంగా జనసేన పార్టీకి గుడ్  బై చెప్పారు. ఇటీవల పవన్ విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ జనసేన పార్టీలో చేరలేదు. ఇప్పటి వరకూ జేడీ లక్ష్మినారాయణ చాలా పార్టీల్లో చేరుతారన్నప్రచారం జరిగింది.  మొన్నటి వరకూ విశాఖ నుంచి పోటీ చేస్తానని ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం తర్వాత చెబుతానని అంటున్నారు. ఏ పార్టీలో కుదరకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని అంటున్నారు.  

విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. రెండు వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించినప్పుడు .. చంద్రబాబు చేసిన సూచనలు అమలు చేయాలన్న చేసిన ప్రకటన వైరల్ అయింది. అప్పుడు  టీడీపీలో చేరుతారా అన్న చర్చ ప్రారంభణయింది. ఆ తర్వాత ఇంతకు ముందే చుక్కల భూముల విషయంలో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని జగన్ నూ ప్రశంసించారు. అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. వైసీపీలో చేరుతారా అన్న అభిప్రాయాలు వినిపించాయి. అంతకు ముందు స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినప్పుడు బీఆర్ఎస్ చీఫ్ పైనా ప్రశంసలు కురిపించారు. బీఆర్ఎస్ లో చేరే విషయంలో చర్చలు జరిగాయని అప్పటికే ప్రచారం జరగడంతో ఇక బీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే అనుకున్నారు. కానీ అన్ని పార్టీలనూ లక్ష్మినారాయణ పొగుడుతున్నారు కానీ..ఎవర్నీ విమర్శించడం లేదు.

పవన్ కల్యాణ్ సినిమాలు చేయనని చెప్పారని.. పార్టీని వదిలేసి సినిమాలు చేస్తున్నందున తాను జనసేనకు రాజీనామా చేశానని గతంలో ప్రకటించారు . చివరికి ఏ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి జేడీ లక్ష్మినారాయణ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ తో పాటు వైసీపీ కూడా రెడీగానే ఉంటుంది. అయితే వైసీపీలో ఆయన చేరలేరు. టీడీపీలో చేరితే విశాఖ  టిక్కెట్ ఇవ్వరు. వేరే ఎక్కడైనా సర్దుబాటు చేస్తారు. కానీ విశాఖ నుంచే పోటీ చేస్తానని ఆయనంటున్నారు. జనసేన పార్టీకి రాజీనామా చేసినందున.. మళ్లీ జనసేన పార్టీ నేతలు ఆయనను ఆహ్వానించడం లేదు.. జేడీనే తాను చేరుతానని వెళ్లలేకపోతున్నారు. ఇక బీజేపీలో చేరేందుకు జేడీ ఆసక్తిగా లేరు. ఎన్నికలకు ముందు ఏమైనా పరిణామాలు జరిగి ఏదో ఓ పార్టీ టిక్కెట్ ఇస్తే సరి లేకపోతే..ఆయన స్వతంత్రంగానే పోటీ చేస్తారని భావిస్తున్నారు.