map
తెలంగాణ

కొంప ముంచిన గూగుల్ మ్యాప్ రిజర్వాయర్ లోకి లారీ

గూగుల్ రోడ్ మ్యాప్ ఓ లారీని ప్రాజెక్టు నీళ్లలోకి తీసుకెళ్లింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి జలాశయం విషయంలో గూగుల్ మ్యాప్ తప్పుదారి తప్పించి ప్రమాదంలో నెట్టివేసింది. గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టులో ఓ లారీ చిక్కుకోంది.  బుధవారం తెల్లవారుజామున రెండు గంటలకు జరిగిన ఈ ఘటన చాలా  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడు కు చెందిన లారీ మంగళవారం రాత్రి చేర్యాల మీదుగా హుస్నాబాద్ వస్తోంది. డ్రైవర్ శివ కు  రహదారిపై సరైన అవగాహన లేకపోవడంతో స్మార్ట్ ఫోన్ లో గూగుల్ రూట్ మ్యాప్ ఆధారంగా లారీని నడిపారు. నందారం స్టేజి దాటిన తర్వాత సూటిగా రోడ్డు ఉందని గూగుల్ చూపగా, చీకట్లో లారీని నడుపుతూ అలాగే వెళ్లారు. వాన వల్ల నిలిచిన నీరు అనుకున్నారు. ముందుకు వెళ్లగానే లోతు పెరిగింది. లారీ క్యాబిన్ వరకు నీళ్లు చేరి కొద్దిగా లోపలికి వచ్చి వాహనం పనిచేయడం ఆగిందని గ్రహించిన వారిద్దరు కిందికి దిగి మెల్లగా సమీపంలోని రామవరం గ్రామం వెళ్ళారు. విషయం గ్రామస్తులకు తెలుపగా లారీ ప్రాజెక్టు నీటిలోకి వెళ్లిందని గ్రహించిన గ్రామస్తులు లారీకి తాళ్లు కట్టి వెనుక్కులాగడంతో అతి కష్టం మీద బయటకు వచ్చింది. వాస్తవానికి నందారం స్టేజ్ వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసి వాహనాలను అక్కడి నుండి బైపాస్ రోడ్డు ద్వారా దారి మళ్ళించారు. అయితే స్టాపర్లు రోడ్డు పక్కన పడిపోయాయి, ఎవరు పట్టించుకోలేదు. దీంతో లారీ ఆ దారిలో వెళ్లి ప్రాజెక్టు నీటిలోకి దూసుకుపోయింది. ఇప్పటికైనా నందారం నుండి ఉన్న దారిని పూర్తిగా మూసివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.