దశలవారీగా మొత్తం 133 లింకు రోడ్లు నిర్మిస్తున్నాం
హైదరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు 5 లింకు రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి రహదారులు చాలా ముఖ్యమని తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 16 లింకు రోడ్లను పూర్తి చేశామని, వీటితో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని కేటీఆర్ చెప్పారు. త్వరలోనే మరో 6 రోడ్లను పూర్తి చేస్తామని అన్నారు. హైదరాబాద్ పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎస్ఆర్డీపీలో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు. రూ. 6 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
అంతేగాక, హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద అదనంగా మొదటి దశలో రూ. 313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. దశలవారీగా మొత్తం 133 లింకు రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. మౌలిక వసతుల విస్తరణలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.