దేశాధినేతలు ఒక చోట సమావేశమయ్యే ఢిల్లీ జి -20 సమ్మిట్ లో తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది. ఈ సదస్సులో 20 దేశాలకు చెందిన ప్రతినిధుల చొక్కాలకు బ్యాడ్జీలను కరీంనగర్ కు చెందిన కళాకారులే తయారు చేశారు. ఈ వర్క్‌ను ఫిలిగ్రీ వర్క్ అని పిలుస్తారు. కోణార్క్ సూర్యదేవాలయాన్ని పోలి ఉండేలా రథ చక్రం తరహాలో ఈ బ్యాడ్జీలను తయారు చేశారు. జి – 20 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రెండు వందల బ్యాడ్జీలను ఆర్డర్ ఇచ్చి చేయించింది. జి – 20 సమ్మిట్‌లో స్టాల్ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి తెలంగాణకు చెందిన కళాకారులకు కూడా అనుమతి దక్కింది. సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ హ్యాండీ క్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ అశోక్ ఆధ్వర్యంలో ఈ స్టాల్ నిర్వహిస్తారు. జి – 20లో మొత్తానికి కరీంనగర్ కళాకారులకు చెందిన స్టాల్ కొనసాగనుంది.కరీంనగర్ ఫిలిగ్రీ వర్క్ కు ఇంతటి అరుదైన గౌరవం దక్కడం ఇదే మొదటి సారి కాదు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా వీరికి గుర్తింపు లభించింది.
అంతేకాక, దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు కొంత మందికి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది.జీ20 సదస్సుకు వచ్చే అతిథులకు అదిరిపోయే ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు ప్రత్యేక కార్యదర్శి ముక్తేశ్ పరదేశి తెలిపారు. స్థానిక వంటకాలతో పసందుగా విందు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు చిరు ధాన్యాలతో కూడిన భారతీయ వంటకాల రుచి చూపిస్తామని చెప్పారు. అలాగే చిరు ధాన్యాల పౌడర్ తో ఫ్రూట్ సలాడ్లు, బెల్లం రాగి ఖీర్, స్పెషల్ మిల్లెట్ థాలి, మిల్లెట్ పలావ్, మిల్లెట్ ఇండ్లీ వంటి వంటకాలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రాజస్థానీ దాల్ బాటీ ఖుర్మా, పశ్చిమ బెంగాల్ రసగుల్లా, దక్షిణాది మసాలా దోశ బిహార్ లిట్టీ చోకాలనూ అతిథిలకు వండి వడ్డించబోతున్నట్లు స్పష్టం చేశారు. అలాగే చాందినీ చౌక్ వంటకాలను కూడా తినిపిస్తామని స్పష్టం చేశారు