dengue
తెలంగాణ ముఖ్యాంశాలు

భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. నెల వయసున్న చిన్నారుల నుంచి వయోవృద్దుల దాకా డెంగ్యూ బారిన పడుతున్నారు. దీంతో ఆస్పత్రులకు జనం క్యూ కడుతున్నారు. 2023 ఆగస్టు నెలలో ఒక హైదరాబాద్ లోనే వెయ్యి 171 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు నెలతో పోలిస్తే 164 కేసులు ఎక్కువ నమోదయ్యాయి. 2023 జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు తెలంగాణలో మొత్తం 2 వేల 972 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. జూలై నెలాఖరు వరకు నమోదైన 961 కేసుల నుంచి ఇది ఒక్కసారిగా పెరిగింది. వీటిలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో ఒక వెయ్యి 562 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.డెంగ్యూ కేసులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జ్వరంతో వచ్చే వారిని గుర్తించి.. ముందుగా వైద్య పరీక్షలు చేస్తున్నారు వైద్య సిబ్బంది. ఆ తర్వాత వైద్య పరీక్షల రిపోర్టుల ప్రకారం.. రోగులకు చికిత్స అందిస్తున్నారు.

అయితే.. వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరగడం సర్వసాధారణమంటున్నారు డాక్టర్లు. డెంగ్యూ కేసులను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. డెంగ్యూ కేసుల నివారణకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. బస్తీలు, కాలనీల్లో ఫాగింగ్ చేస్తున్నారు. డెంగ్యూ లక్షణాలు ఉంటే సొంతంగా మెడిసిన్స్ వాడొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. దగ్గరలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లకు చూపించుకోవాలని సలహా ఇస్తున్నారు. సకాలంలో చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. నగరంలోని రోడ్లు, భవన నిర్మాణ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండడం కారణంగా దోమలకు అవాసంగా ఏర్పడి డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వర్షాల కారణంగా ఇండ్ల మధ్య నీళ్లు చేరి..  పారిశుధ్య లోపం కారణంగా డెంగ్యూ కారక దోమలు పెరిగాయి. దీంతో ప్రజలు వైరల్ ఫీవర్ బారినపడుతున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు.
డెంగ్యూ లక్షణాలు ఇవే..
డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమించే వైరల్‌ వ్యాధి. ప్రధానంగా ఈడిస్‌ దోమల ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ సోకిన సమయంలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, దద్దుర్లు, ఫ్లూ వంటి లక్షణాలుంటాయి. డెంగ్యూ సోకిన సమయంలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, దద్దుర్లు, ఫ్లూ వంటి లక్షణాలుంటాయి. తీవ్రమైన సందర్భాల్లో.. డెంగ్యూ హెమరేజిక్ జ్వరానికి దారితీస్తుంది. ఇది ప్రాణాంతక పరిస్థితని తలెత్తుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.మనం నివసించే ప్రాంతాల్లో.. దోమలు పెరగకుండా చూసుకోవాలి. దోమలు నిలకడగా ఉన్న నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. పూల కుండీలు, కుండీలు, బకెట్‌లు వంటి వాటిలో నీటిని నిల్వలేకుండా చూసుకోవాలి. అలాగే దోమల బెడదను తగ్గించకునేందుకు ఇంటి పరిసరాల్లో ఎలాంటి నీటి నిల్వకుండా చేసుకోవాలి. దోమలు వ్యాప్తిచెందకుండా ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఇంటి చుట్టుపక్కల ఏవైనా మొక్కలు ఉంటే.. వాటిని పొదలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కల పొదలను క్రమం తప్పకుండా కత్తిరించడం చాలా అవసరం.. లేకుంటే దోమలు మొక్కలను కొమ్మలను ఆశ్రయిస్తాయి. అదే సమయంలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ సరిగ్గా పారవేయాలి. వ్యర్థాలు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే దోమల సంతానోత్పత్తికి చెత్త కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటుంది. ఇంటి పరిసరాల్లో తాగి పడేసిన కొబ్బరి బొండాలను లేకుండా చూసుకోవాలి.
డెంగ్యూ వ్యాధి రాకుండా తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి
పిల్లలు స్కూలుకు వెళ్లేటప్పుడు చేతులు, కాళ్లు కప్పి ఉండేలా దుస్తులు ధరించాలి.
దోమలు కుట్టకుండా దోమతెరలు, కొన్ని రసాయక క్రిమి కీటకాలు మందులు వాడాలి.
ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.  
పండ్లు, బలమైన పోషకాలు ఉండి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇవ్వాలి.
 ప్రేన్, కివి, బొప్పాయి, స్ట్రాబెర్రీలు మొదలైన పండ్లను పిల్లల ఆహారంలో చేర్చాలి.  
డెంగీ లక్షణాలు
జ్వరం విపరీతంగా ఉంటుంది. దాదాపు 104 డిగ్రీలు
తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులు
కళ్లలో విపరీతమైన నొప్పి
శరీరంపై దద్దర్లు
వాంతులు కావడం, కడుపునొప్పి
నోరు ఆరిపోవడం, విపరీతమైన దాహం
కొన్ని సందర్భాల్లో జ్వరం తీవ్రతను బట్టి రక్తస్రావం