g20
జాతీయం

ఢిల్లీ డిక్ల‌రేష‌న్ పాజిటివ్ సంకేతాల్ని ఇచ్చింది: చైనా

 జీ20 స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై .. చైనా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ఢిల్లీ డిక్ల‌రేష‌న్ ప్ర‌పంచ వ్యాప్తంగా పాజిటివ్ సంకేతాన్ని పంపింద‌ని డ్రాగ‌న్ దేశం పేర్కొన్న‌ది. రెండు రోజుల పాటు ఢిల్లీలో జ‌రిగిన జీ20 స‌మావేశాల‌పై చైనా త‌న మౌనాన్ని వీడింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను, ప్ర‌పంచ ఆర్ధిక వ్య‌వ‌స్థ రిక‌వ‌రీ కోసం ఆ గ్రూపు చేస్తున్న ప‌నుల్ని చైనా ప్ర‌శంసించింది. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై డిక్ల‌రేష‌న్ కోసం భార‌త్ చేప‌ట్టిన ప్ర‌య‌త్నాల్ని చైనా మెచ్చుకున్న‌ది. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి మావో నింగ్ స్పందించారు. ఢిల్లీ డిక్ల‌రేష‌న్ త‌యారీ ప్ర‌క్రియ‌లో చైనా కూడా స‌హ‌క‌రించింద‌న్నారు. త‌మ దేశం నిర్మాణాత్మ‌క పాత్ర‌ను పోషించింద‌న్నారు.అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళ‌న‌ల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌ని, స‌మ‌గ్ర అభివృద్ధి కోసం ఏక‌గ్రీవంగా డిక్ల‌రేష‌న్‌ను ఆమోదించిన‌ట్లు చైనా తెలిపింది. ఢిల్లీలో జ‌రిగిన జీ20 స‌మావేశాల‌కు చైనా త‌ర‌పున ఆ దేశ ప్ర‌ధాని లీ కియాంగ్ హాజ‌ర‌య్యారు. \

ఉక్రెయిన్ అంశంపై త‌మ అభిప్రాయంలో ఎటువంటి మార్పు ఉండ‌ద‌ని చైనా తెలిపింది. చ‌ర్చ‌లు, సంప్ర‌దింపుల ద్వారానే ఉక్రెయిన్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు అని తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభంపై శాంతి చ‌ర్చ‌ల‌కు త‌మ దేశం స‌హ‌క‌రిస్తుంద‌ని ప్ర‌తినిధి చెప్పారు.