తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మూడో రోజు జైలులో ఉన్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఈ నెల 22 వరకూ జ్యుడిషియల్ కస్టడీకి న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయనకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ నెంబరు 7691 కేటాయించారు. అయితే ఇంటి నుంచే భోజనం, మందులు వస్తుండటంతో ఇప్పుడిప్పుడే ఆయన జైలు జీవితానికి అలవాటుపడుతున్నారని ఆయనను కలిసిన వారు చెబుతున్నారు. మానసికంగా… ఇప్పటి వరకూ చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కలిశారు. భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి ఆయనతో ములాఖత్ అయి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నా, చంద్రబాబుకు అందుతున్న సౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కొంత వ్యాయామం చేస్తూ శారీరకంగా ధృఢంగా ఉన్నప్పటికీ మానసికంగా కొంత కుంగిపోయినట్లు కనపిస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న స్నేహ బ్లాక్ లోని ప్రత్యేక గదిలో ఉంటున్నారు.
ఆయనకు ఆ బ్లాక్ లో ఆ గదిని కేటాయించారు. అయితే రాజమండ్రి జైలులో ఈ బ్లాక్ ను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రారంభించారని అధికారులు చెబుతున్నారు. 2014 నుంచి 2019 వరకూ ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఈ స్నేహ బ్లాక్ ను జైలులో నిర్మించారు. అప్పట్లో దానిని ప్రారంభించిన చంద్రబాబు ఇప్పుడు అదే బ్లాక్ లో ఖైదీగా ఉండటం కర్మ ఫలితమేనంటున్నారు. తాను ప్రారంభించిన బ్లాక్ లోనే తాను ఖైదీగా ఉంటానని చంద్రబాబు బహుశ ఊహించి ఉండకపోవచ్చు. దీనిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.