ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం జగన్ ఏ క్షణమైనా ఢిల్లీ వెళ్లే అవకశం ఉంది. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాలతోనూ సమావేశం అవుతారని చెబుతున్నారు. ఆ భేటీలో ముందస్తు ఎన్నికల అంశాన్ని చెప్పి.. అసెంబ్లీ రద్దు అంశం, తదుపరి ఎన్నికల నిర్వహణ అంశంపై స్పష్టత తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. జమిలీ ఎన్నికలు అంటూ వస్తే డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. సీఎం జగన్ కూడా ఈ దిశగానే కసరత్తు చేసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులతో వెంటనే ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముకుంటున్నారు. అందుకే ఆయన ప్రిపరేషన్స్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ నెల ఇరవయ్యే తేదీ లోపు అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉంది. ఆరేడు రోజుల పాటు అసెంబ్లీని సమావేశపర్చి .. వారం పాటు.. తాను చేసిన పనుల గురించి ప్రజెంటేషన్ ఇస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
అంటే ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి, సంక్షేమం మొత్తం ప్రజల ముందు పెడతారని అంటున్నారు. ఇది ఎన్నికలకు సన్నాహమేనని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే పలు పథకాలకు బటన్స్ నొక్కాల్సి ఉంది. కానీ నెలాఖరు వచ్చే సరికి.. ఆర్బీఐ దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్తే తప్ప..జీతాలు , పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆర్బీఐ దగ్గర ఐదున్నర నెలలు కూడా పూర్తి కాకుండానే నలభైవేల కోట్లకుపైగా అప్పు తెచ్చుకున్నారు. ఇది కేంద్రం ఇచ్చిన పరిమితులు దాటిపోయింది. ఆరు నెలలలో బడ్జెట్ అంచనాలంత అప్పు చేసేసినట్లవుతుంది. తర్వాత అప్పులు దొరకడం కూడా కష్టమన్న వాదన వినిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకూ ఇలా నెట్టుకు రావడం కష్టమవుతుందని.. ఇప్పుడే ఎన్నికలకు వెళ్తే.. చాలా సమస్యలు పరిష్కారమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ముందస్తుకు వెళ్లాలంటే.. కేంద్రం సానుకూలత తప్పనిసరి.
ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. కానీ ఎలా చూసినా ఏపీకి సంబంధఇంచిన ప్రక్రియను అధికారికంగా ప్రారంభించలేరు. అసెంబ్లీ రద్దు అయిన తర్వాతనే ప్రారంభిస్తారు. కేంద్రం జమిలీ ఎన్నికలపై ఆలోచన చేస్తోంది. అదే ఆలోచన ఉంటే.. పార్లమెంట్ తో జరగాల్సిన రాష్ట్రం ఎన్నికలను ముందుకు జరిపేందుకు అంగీకరించదు. అంటే జగన్ అసెంబ్లీని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన విధిస్తారు కానీ ఎన్నికలు పెట్టారు. మొత్తం కేంద్రం అనుమతితోనే జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.