సెప్టెంబర్ 30న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం కానుందని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 45 రోజుల వ్యవధిలో గ్రామాల్లో హెల్త్ క్యాంపులు, వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే సీఎంఓ, వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి కలెక్టర్లుతో చర్చించి, ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేశారు. జగనన్న సురక్ష తరహాలోనే ఈ కార్యక్రమం చేపడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఒక నిర్ణీత రోజున హెల్త్ క్యాంపు నిర్వహించాలని సూచించారు. సురక్షలో ఏ రకంగా ప్రజల సమస్యలను పరిష్కరించి సుమారు 98 లక్షలకు పైగా సర్టిఫికేట్లు నెల రోజుల వ్యవధిలో అందించామో… అదే తరహాలో ఇక్కడ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సురక్ష కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్స్ ఇప్పిస్తూ, ప్రభుత్వం మీకు అందుబాటులో, మీ ఊరిలోనే ఉందని భరోసా ఇవ్వగలిగామన్నారు. అదే మాదిరిగానే జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో మరో కార్యక్రమం చేస్తున్నామన్నారు.
“ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారించే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నాం. మనం చేసే ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ఒక పర్టిక్యులర్ రోజునాడు హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం. అందులో ప్రజలకు అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు, కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. హెల్త్ క్యాంపు నిర్వహించిన గ్రామాన్ని మ్యాపింగ్ చేసి, ఏ సమస్యలున్నా యన్నది తెలుసుకుని ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరికి ఎలాంటి ట్రీట్‌మెంట్ జరగాలి, ఎలాంటి మందులు కావాలో తెలుస్తుంది. ఇంట్లో ఫెరాలసిస్, మరేదైనా సమస్య ఉంటే వారికి రెగ్యులర్‌గా మెడిసిన్ ఇవ్వడంతో పాటు వైద్యుడు వారిని పరీక్షించి… వారికి అవసరమైన మందులతో పాటు చికిత్స కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నాం. ఒకవైపు తనిఖీలు చేస్తూనే మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. దీనికి సంబంధించిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి” – సీఎం
ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ప్రతి ఇల్లు కవర్ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. క్రానిక్ పేషెంట్లు ఉన్న ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలతోపాటు రక్తహీనత ఉన్నవాళ్లను కూడా గుర్తించాలన్నారు. జీరో ఎనిమిక్ కేసులే లక్ష్యంగా పనిచేయాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, నియోనేటల్ కేసులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధపడుతున్న వారికి చికిత్స అందించాలని సూచించారు. ఆయా వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కూడా గ్రామాల్లో అవగాహన కలిగించాలన్నారు. ఈ వివరాలతో ప్రతి గ్రామాన్ని మేపింగ్ చేసి, 45 రోజుల పీరియడ్‌తో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తర్వాత కూడా చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సీఎం ఆదేశిచారు. దీనివల్ల ప్రతి 6 నెలలకొకసారి ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లవుతుందన్నారు.
సెప్టెంబర్ 30న ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు… గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవాలన్నారు.తొలిదశలో వలంటీర్లు, గృహసారధులు, ప్రజాప్రతినిధులు ఈ ముగ్గురూ కలిసి ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేయబోయే రోజు, తేదీతోపాటు ఏయే కార్యక్రమాలు చేపడతామో వివరిస్తారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న ఆసుపత్రుల వివరాలు, పథకాన్ని ఎలా వినియోగించుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తారు. తర్వాత దశలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఆ ఏరియా వాలంటీర్లతో కలిసి వెళ్లి 7 రకాల టెస్టులకు సంబంధించిన వివరాలను ప్రజలకు వివరిస్తారు. రెండో టీం ఆశావర్కర్, ఏఎన్‌ఎంతో సీహెచ్‌ఓ వస్తారు. ఇక్కడితో రెండో దశ పూర్తవుతుంది. 7 రకాల టెస్టులు చేసే విధంగా.. బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, యూరిన్ టెస్టుతో పాటు (ఉమ్మి) స్పూటమ్ టెస్ట్, మలేరియా, డెంగ్యూ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొబైల్ యాప్‌లో ఇలా సేకరించిన డేటాను అప్‌డేట్ చేస్తారు. ప్రతి ఇంటికి, పేషెంట్‌కి ఒక కేస్ షీట్ కూడా జనరేట్ అవుతుంది.
ఫేజ్-3లో మరోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. హెల్త్ క్యాంప్ జరగబోయే 3 రోజుల ముందు మరోసారి వాలంటీర్, ఏఎన్‌ఎం, ప్రజా ప్రతినిధులు ప్రజలు ఆ గ్రామంలో మరోసారి గుర్తు చేస్తారు. ఫేజ్ 4లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు. ప్రతి మండలంలో ఒక రోజు హెల్త్ క్యాంపు ఉంటుంది. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో.. రూరల్, అర్బన్ ఏరియాలోనూ ఈ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తారు.వైద్యారోగ్యశాఖలో నాలుగేళ్లలో 53,126 పోస్టులు భర్తీ చేశామని సీఎం జగన్ అన్నారు. అన్ని ఆసుపత్రులను జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేశామన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, టీచింగ్ ఆసుపత్రుల వరకు నాడు-నేడుతో అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. 2356 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. ప్రతి పేషెంట్ ఈ సేవలను ఉచితంగా అందుకోవాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతి పేషెంట్ డబ్బులు ఖర్చు లేకుండా.. అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చికిత్స అందుకోవాలన్నదే మన తాపత్రయం అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఎక్కడైనా ఖాళీలుంటే మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు వాటిని తక్షణమే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.