sharmila
తెలంగాణ రాజకీయం

షర్మిల వద్దంటున్న టీ కాంగ్రెస్ చేరికపై రాని క్లారిటీ

వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న షర్మిల..పార్టీని విలీనం చేస్తూ..ఆమె కాంగ్రెస్ లో చేరడం ఖాయమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల..రాహుల్ గాంధీ, సోనియాలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె కాంగ్రెస్ లోకి ఎప్పుడు వెళ్తారనేది చర్చగా మారింది. తుది చర్చలు జరుగుతున్నాయని వైఎస్ వర్థంతి సందర్భంగా చెప్పారు. కానీ తర్వాత సైలెంట్ అయ్యారు. సెప్టెంబర్ 16, 17 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్‌కు వస్తున్నారు. 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇక 17న తెలంగాణ విమోచనదినోత్సవం సందర్భంగా భారీ సభ జరగనుంది. అయితే షర్మిల 15న కాంగ్రెస్ లో చేరనున్నారని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి.  15 సాయంత్రం సోనియా, రాహుల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అప్పుడు షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తారని  చెబుతున్నారు.  దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికైతే షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయం. ఇక షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె స్థానం ఏంటి అనేది క్లారిటీ లేదు. పైగా ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తుందనేది క్లారిటీ లేదు.

ఇప్పటికే ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ అక్కడ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. దీంతో సీటు ఆయనకే దక్కే ఛాన్స్ ఉంది. షర్మిల తెలంగాణ ఎన్నికల బరిలో ఉంటే..ఆంధ్రా పెత్తనం అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసి..కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేయవచ్చు అని కాంగ్రెస్ నేతలు కంగారు పడుతున్నారు. అందుకే ఆమె కాంగ్రెస్ లోకి వద్దని రేవంత్ రెడ్డి హైకమాండ్ పై తీవ్ర స్థాయిలో వత్తిడి తెస్తున్నరని అంటున్నారు.   ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ని కే‌వి‌పి రామచంద్రరావు నడిపిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్‌కు నష్టమని చెబుతున్నారు. ఆమెను పార్టీలో చేర్చుకోవాలనుకున్నా… హైదరాబాద్ లో వద్దని ఢిల్లీలో చేర్చుకుని జాతీయ స్థాయిలో ఏదో ఓ పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని.. కానీ తెలంగాణ పార్టీలో మాత్రం షర్మిల వద్దని కాంగ్రెస్ నేతలంటున్నారు.కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి కర చర్చ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తోంది. షర్మిల పార్టీ విలీనంపై ఇంత వరకూ…హైకమాండ్ నుంచి  ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. అందుకే షర్మిల అధికారిక ప్రకటన చేయలేదు.

ఆమెకు హైకమాండ్  భరోసా ఇచ్చిందని చెబుతున్నారు. ఓ వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు తప్ప మిగతా వారంతా షర్మిల రాకను వ్యతిరేకిస్తున్నారు. వీరిని కాదని హైకమాండ్ పార్టీలో షర్మిలను చేర్చుకుంటుందా … వాయిదా వేస్తుందా అన్నది వేచి చూడాల్సి  ఉంది.